వక్ఫ్‌కు వ్యతిరేకం కాకున్నా.. టీడీపీ ముస్లింల పక్షమే.. విశ్లేషణ!
తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024కు సభ 1/3 మెజారిటీతో ఆమోదించింది.;

తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024కు సభ 1/3 మెజారిటీతో ఆమోదించింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పట్టుబట్టనేల పట్టు విడవనేల అన్నట్టుగా.. మోడీ సర్కారు తాను తలచింది చేయడంలో ముందున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో అయోధ్య కావొచ్చు.. ట్రిపుల్ తలాక్ కావొచ్చు.. ఇప్పుడు వక్ఫ్ కావొచ్చు.. తాను అనుకున్నది సాధిస్తూనే ఉంది.
అయితే.. బీజేపీ మాట ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు కూడా.. కేంద్రానికి మద్దతుగా నిలవ డం.. ఇప్పుడు చర్చకు వస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీకి చెందిన అధికార పార్టీ టీడీపీ బలంగా ఉంది. కేంద్రంలోనూ మోడీ సర్కారుకు మెరుగైన బలం ప్రసాదించి.. కేంద్ర ప్రభుత్వం సజావుగా సాగేందుకు సహకరిస్తోంది. ఇలాంటి పార్టీ కూడా.. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ప్రకటించింది. పార్లమెంటులో ఈ బిల్లు చర్చకు వస్తుందని తెలిసి.. మూడు లైన్ల విప్ జారీ చేయడం.. బహిరంగంగానే మద్దతు ప్రకటించడం తెలిసిందే.
అయితే.. ఇలా చేయడం ద్వారా ముస్లింల ఓట్లు టీడీపీకి దూరమవుతాయన్న చర్చ సహజంగానే తెరమీది కి వస్తుంది. ఈ విషయాన్ని ఒకింత లోతుగా పరిశీలిస్తే.. వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతు ప్రకటించినంత మాత్రాన ఆ పార్టీ పూర్తిగా మైనారిటీలకు వ్యతిరేకం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే.. మైనారిటీలకు అంతో ఇంతో చేసిన పార్టీగా.. ప్రభుత్వంగా కూడా.. టీడీపీకి మంచి గుర్తింపు ఉంది. పైగా ఇప్పుడు పెట్టిన బిల్లులోనూ మూడు కీలకమైన సవరణలను ప్రతిపాదించింది. వీటికి కేంద్రం ఆమోదించిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఇక, మైనారిటీల సంక్షేమానికి సంబంధించి చూస్తే.. రంజాన్ తోఫాను ప్రతి ఏటా అందించారు(ఈ ఏడాది వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలతో చేయించారు). ముస్లింలు మక్కాకు వెళ్తే.. వారికి 2014-19 మధ్య రూ.50000 వరకు రాయితీ ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.లక్షకు పెంచారు. ఇక, మైనారిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాలకు వెళ్తే.. వారికి అయ్యే చదువుల ఖర్చును కూడా టీడీపీ ప్రభుత్వమే భరిస్తోంది.
మైనారిటీలలో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేందుకు ఆయా పనిముట్లను కొనుగోలు చేసేందుకు సహకరిస్తోంది. వాహన డ్రైవర్లకు ప్రోత్సాహకాలు, రుణాలు కూడా ఇస్తోంది. సో.. ఎలా చూసుకున్నా.. వారికి సంక్షేమం విషయంలో టీడీపీ ఎలాంటి లోటు చేయడం లేదు. కాబట్టి.. వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రకటించినంత మాత్రాన టీడీపీని వ్యతిరేక కోణంలో చూడలేమన్నది వాస్తవం.