ఉత్త‌రాంధ్ర ఎమ్మెల్సీపై టీడీపీ కీల‌క నిర్ణ‌యం!

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

Update: 2025-02-19 10:03 GMT

ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అంటే.. మ‌రో వారం రోజుల్లో ప్ర‌చారానికి తెర‌ప‌డ‌నుంది. రాష్ట్రంలో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌గా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాలు, ఉమ్మ‌డి కృష్ణా, గుంటూరు జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీలో ఉన్న‌వారిలో ఇద్ద‌రూ టీడీపీ నాయ‌కులే కావ‌డం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణాజిల్లాల నుంచి మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఉమ్మ‌డి ఉభ‌య గోదావ‌రి జిల్లాల నుంచి పేరాబ‌త్తుల రాజ‌శేఖ‌ర్ బ‌రిలో ఉన్నారు. వీరిద్ద‌రూకూడా టీడీపీ నాయకులే కావ‌డంతో కూట‌మి పార్టీలైన‌.. బీజేపీ, జ‌న‌సేన‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌డుతున్నారు. కొన్ని కొన్ని చోట్ల నాయ‌కులు క‌లిసిరాక‌పోవ‌డంతో అధినాయ‌కులే వారిని లైన్‌లో పెడుతున్నారు. దీంతో ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి ప్ర‌చారం పుంజుకుంది.

ఇక‌, కీల‌క‌మైన మ‌రో ఎమ్మెల్సీ ఎన్నిక‌.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీస్థానం. ఇక్క‌డ పార్టీల‌కు అతీతంగా అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. వీరిలో పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ‌కు టీడీపీ తాజాగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. ఈ ఎన్నిక‌లో టీడీపీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న అంశం ఇటీవ‌ల చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో ఈ విష‌యంతేల్చేందుకు చంద్ర‌బాబు విశాఖ ఎంపీ.. శ్రీభ‌ర‌త్ నేతృత్వంలోక‌మిటీని వేశారు. ఆయ‌న అన్ని కోణాల్లోనూ ప‌రిశీలించి, అంద‌రి అభిప్రాయాలు తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో పాక‌లపాటి ర‌ఘువ‌ర్మ‌కు టీడీపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌న్న సూచ‌న‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబు ఈ విష‌యంపై ప్ర‌క‌ట‌న చేశారు. పాక‌ల‌పాటికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలిపారు. ఓటు హ‌క్కు ఉన్న టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ పాక‌ల‌పాటికి ద‌న్నుగా నిల‌వాల‌ని ఆయ‌న‌ను గెలిపించాల‌ని పార్టీ కార్యాల‌యం ఓప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అదేవిధంగా ఎంపీ శ్రీభ‌ర‌త్ సైతం పాక‌ల‌పాటిని గెలిపించాల‌ని పార్టీ త‌ర‌పున పిలుపునిచ్చారు.

Tags:    

Similar News