వరదల వేళ కాస్త ప్రిపేర్ అయి రావొచ్చుగా జగన్ సార్!
అయితే.. జగన్ మాత్రం బుడమేరును నదిగా పేర్కొనటంతో ఆయన మాటలు వైరల్ అయ్యాయి.
మిగిలిన సందర్భాలు సరే. కొన్ని గంభీరమైన సందర్భాల్లో సంబంధం లేని అంశాలు చెప్పినా.. వాస్తవాల్ని ఏ మాత్రం వక్రీకరించి చెప్పినా? వాస్తవ దూరంగా ఉండేలా వెల్లడించినా.. వాస్తవాలకు భిన్నంగా మాట్లాడినా అభాసుపాలు కావటం ఖాయం. ఈ చిన్న లాజిక్ ను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది. విజయవాడపై విరుచుకుపడిన వరదలకు ప్రధాన కారణంగా బుడమేరు వాగు.
అయితే.. జగన్ మాత్రం బుడమేరును నదిగా పేర్కొనటంతో ఆయన మాటలు వైరల్ అయ్యాయి. ఆయన మాటల్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తికి కనీస అవగాహన లేకపోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. ఓవైపు ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. వారిని ఓదార్చటం.. వారికి అవసరమైన వైద్య సదుపాయాలు.. ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా అవగాహన లేని మాటలు మాట్లాడటం వల్ల మొదటికే మోసం వస్తుంది.
మొన్నటికి మొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిని వరద నుంచి కాపాడటం కోసం బుడమేరు లాకులు ఎత్తేసి విజయవాడను ముంచేసినట్లుగా జగన్ పార్టీ వారు వ్యాఖ్యానించారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు అవగాహన లేని వ్యాఖ్యల కారణంగా ఇటీవల కాలంలో వైఎస్ జగన్ తరచూ అభాసుపాలు అవుతున్నారు. తాజాగా బుడమేరును నదిగా పేర్కొన్న వైఎస్ జగన్ వీడియో వైరల్ గా మారింది. బుడమేరు నది ఎంతమాత్రం కాదు.. కేవలం వాగు మాత్రమే. ఇలాంటి అంశాలపై మాట్లాడటానికి సిద్ధమైన వేళ.. జగన్ కాస్తంత సేపు ఓపిగ్గా కూర్చొని అన్ని వివరాల్ని సేకరించి.. అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే మాట్లాడితే బాగుంటుంది.
అందుకు భిన్నంగా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. ఉన్నపాటి మర్యాదలు కూడా మిస్ కావటం ఖాయమంటున్నారు. ఇప్పటివరకు ఏం జరిగినా.. జరిగిందేదో జరిగిందని భావించి.. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాల గురించి అవగాహనతోనే బయటకు వెళితే మరింత బాగుంటుందన్న సూచన చేస్తున్నారు. అంతేకాదు.. కీలక అంశాల మీద మాట్లాడటానికి ముందు ఒకసారి క్రాస్ చెక్ ఏర్పాట్లు కూడా అవసరమన్న విషయాన్ని ఆయన అర్థమయ్యేలా చెప్పాలంటున్నారు. విషయాల మీద అవగాహన లేకుండా వాటిని ప్రస్తావించకుండా ఉంటే మంచిదంటున్నారు. అదేమీ లేకుండా తనకు అన్ని తెలుసన్నట్లుగా మాట్లాడే క్రమంలో దొర్లే తప్పులు జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ విషయాన్ని జగన్ గుర్తించారా?