చంద్రబాబు పరువు కాపాడిన కుప్పం టీడీపీ నేతలు!

ముఖ్యమంత్రి చంద్రబాబుకు గొప్ప ఊరట లభించింది. తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది.;

Update: 2025-04-28 09:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబుకు గొప్ప ఊరట లభించింది. తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. నిజానికి కుప్పం మున్సిపాలిటీలో విజయం సాధించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంత గొప్ప విషయమేమీ కాదు. కానీ, గత ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న మున్సిపాలిటీని తిరిగి దక్కించుకోవడం మాత్రం పెద్ద విజయంగానే అభివర్ణించాలి. మొత్తం 25 కౌన్సిలర్ స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీ కేవలం ఆరు చోట్లే గెలిచింది. కానీ, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు తర్వాత కుప్పం మున్సిపాలిటీలో బలాబలాలు తారుమారయ్యాయి.

కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. గత ఏడాది చైర్మన్ సుధీర్ రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించింది. వాస్తవానికి 2021లో జరిగిన కుప్పం మున్సిపల్ తొలి ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2019లో మేజర్ పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్ర్ గ్రేడ్ చేశారు. కుప్పంతోపాటు మరో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. 2019 ఎన్నికల వరకు ఈ 8 పంచాయతీల్లోనూ టీడీపీదే హవా. అయితే కొత్త మున్సిపాలిటీ కావడంతో 2020లో కుప్పానికి ఎన్నిక నిర్వహించలేదు. 2021 నవంబర్ లో ఎన్నికలు జరగ్గా, అప్పటి వైసీపీ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహరచనతో చంద్రబాబు ఇలాకాలో భారీ విజయం సాధించింది. మొత్తం 25 కౌన్సిల్ స్థానాలకు వైసీపీ 19 చోట్ల, టీడీపీ 6 చోట్ల గెలుపొందాయి. కుప్పం మున్సిపాలిటీని చేజిక్కించుకోవడంతో వైసీపీ వైనాట్ 175 నినాదాన్ని అందుకుంది.

అయితే కుప్పం మున్సిపల్ ఎన్నికల నిర్వహణే సరిగా లేదని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి కుప్పంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, ప్రలోభపెట్టి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అయితే ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కంచుకోటలాంటి కుప్పంలో వేరేపార్టీ జెండా ఎగరడం ఆయనకు తీరని అవమానంగా ప్రచారం జరిగింది. 1989 నుంచి చంద్రబాబు వరుసగా గెలుస్తున్న కుప్పంలో స్థానిక సంస్థల్లో కూడా టీడీపీదే హవా. కానీ, 2021లో తొలిసారి పసుపు జెండా స్థానంలో ఫ్యాన్ ప్రభంజనం వీయడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు షాక్ తిన్నారు.

ఇక కుప్పం మున్సిపల్ ఎన్నికల పరాజయంతో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యారు. కుప్పంలో సొంత ఇల్లు నిర్మించుకుంటానని ప్రకటించడంతోపాటు నెలనెల తను గానీ, సతీమణి భువనేశ్వరి గాని కుప్పంలో పర్యటించేలా ప్లాన్ చేశారు. దీంతో 2024 ఎన్నికల నాటికి టీడీపీకి ఎదురులేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 అన్న వైసీపీకి దిమ్మదిరిగే షాక్ ఇవ్వడంతోపాటు కుప్పంలో చంద్రబాబు భారీ విక్టరీ సాధించారు.

ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన మున్సిపల్ చైర్మన్ సుధీర్ తన పదవికి రాజీనామా చేశారు. తనతోపాటు నలుగురు కౌన్సిలర్లతో టీడీపీలో చేరిపోయారు. దీంతో ఏడాదిగా కుప్పం మున్సిపాలిటీ ఇన్ చార్జి పాలనలో సాగుతోంది. ఈ రోజు ఉప ఎన్నిక నిర్వహించడంతో టీడీపీ కౌన్సిలర్ సెల్వరాజ్ చైర్మనుగా గెలుపొందారు. ఆయనకు మొత్తం 16 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు పడ్డాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఆరు కౌన్సిల్ స్థానాలు గెలుపొందగా, అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరో నలుగురు చేరారు. ఇక ఉప ఎన్నిక సమయంలో మరో నలుగురు మద్దతు ప్రకటించగా, వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎన్నికకు గైర్హాజరు అయ్యారు. ఎక్స్ అఫీషియో ఓటరు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ మద్దతుతో కుప్పంలో టీడీపీ అభ్యర్థి షాజహన్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పూర్తిగా వైసీపీని తరమేసినట్లైందని అంటున్నారు.

Tags:    

Similar News