టీటీడీపీలో కొత్త ఉత్సాహం... గ్రేటర్ లో ఆసక్తికర చర్చ!

ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తుంది!

Update: 2024-11-30 09:57 GMT

ఏపీలో బీజేపీ, జనసేనలతో కలిసి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఏపీలో విజయం సాధించింది. ఈ ఉత్సాహంలో ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యింది! ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఓ గుడ్ న్యూస్ వినిపిస్తుంది!

అవును... 2025లో జరగబోయే గ్రేటర్ హైదరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీ.హెచ్.ఎం.సీ) ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర చర్చ మొదలైంది! ఇందులో భాగంగా... ఈ సారి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో పాటు గ్రేటర్ లో బలంగా ఉన్న బీఆరెస్స్, బీజేపీ, ఎంఐఎం లు బరిలోకి దిగనున్నాయి. ఇదే సమయంలో ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సక్సెస్ అయిన టీడీపీ కూడా రంగంలోకి దిగనుందని అంటున్నారు.

ఇటీవల ఏపీలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన 29 రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మార్కును దాటి సరికొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. మరోపక్క ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలోనూ పార్టీలో సభ్యత్వాలు గణనీయంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ మెంబర్ షిప్ లో కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే.. తెలంగాణలో టీడీపీకి తిరిగి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే... వచ్చే జీ.హెచ్.ఎం.సీ. ఎన్నికల్లో పోటీకి తెలుగు తమ్ముళ్లు సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... బీజేపీతో పొత్తులోనే గ్రేటర్ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉందని అంటుండటంతో... గత ఎన్నికల ఫలితాలు అందుకు సంఘీభావం తెలుపుతున్నాయని.. సానుకూల సంకేతాలు పంపేదిగా ఉన్నాయని చెబుతున్నారు.

2020లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో బీఆరెస్స్, బీజేపీలు చెరో 35% ఓట్ల షెర్ సాధించగా.. ఎంఐఎం 18% సాధించింది. ఇక ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 6 శాతానికి మాత్రమే పరిమితమైంది! మరోపక్క సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. హైదరాబాద్ లో ఆ పార్టీ బలం అంతంతమాత్రమే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జీ.హెచ్.ఎం.సీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ పోటీ కన్ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా కూకట్ పల్లి, సనత్ నగర్, జూబ్లిహిల్స్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్ర నగర్ వంటి ఏరియాలు టీడీపీ కంచుకోటలని.. 2024 ఎన్నికల్లో ఏపీలో ఫలితాల అనంతరం ఈ ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ కేడర్ యాక్టివేట్ అవుతున్నారని అంటున్నారు. మరి ఈ విషయంపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!

Tags:    

Similar News