వంద రోజుల్లో 15 వేల కోట్ల అప్పు....టీడీపీ కూటమి రికార్డు!
కేవలం రెండున్నర నెలలోనే ఇంత అప్పు చేస్తే మిగిలిన నెలలలో అప్పులు తలచుకుంటే భయపడాల్సిందే అని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Aug 2024 1:09 PM GMTఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏమి చేసింది అంటే అప్పులే అన్న చర్చ సాగుతోంది. ఏపీ అప్పుల కుప్ప అంటూ వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కూటమి నేతలే. ఏపీ శ్రీలంకగా మారుతుంది అని కూడా ఎన్నో పోలికలు తెచ్చి జనాలను ఆందోళనకి గురి చేశారు. అప్పులు తెచ్చి ఏపీని వైసీపీ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది అని కూడా కూటమి పెద్దలు ఆరోపించారు.
తాము సంపద సృష్టించి చూపిస్తామని కూడా అన్నారు. ఆ విధంగా చూస్తే ఏపీలో సంపద సృష్టికి కూటమి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో ఎవరికీ తెలియదు కానీ అప్పులు మాత్రం పెద్ద ఎత్తున చేస్తున్నారు. జూన్ 12న కూటమి సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చింది. దానికి ఒక రోజు ముందు నుంచే అప్పులు చేయడం మొదలెట్టింది.
ఇలా ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే ఏకంగా 15 వేల కోట్లకు పెరిగిపోయాయని. కేవలం రెండున్నర నెలలోనే ఇంత అప్పు చేస్తే మిగిలిన నెలలలో అప్పులు తలచుకుంటే భయపడాల్సిందే అని అంటున్నారు.
ఈ అప్పు లెక్కలు ఒక్కసారిగా చూస్తే జూన్ 11న నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో రెండు వేల కోట్లను అప్పుగా తెచ్చింది. ఆ తరువాత అదే నెలలో 25వ తేదీన సెక్యూరిటీ వేలంలో మరో రెండు వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చింది. ఇక జూలై నెలలో చూసుకుంటే అదే నెల 2వ తేదీన అయిదు వేల కోట్ల రూపాయలు, 16న రెండు వేల కోట్ల రూపాయలు, 30న మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది కూటమి సర్కార్.
ఇక తాజాగా ఆగస్టు నెలలో చూస్తే ఈ నెల 27న మరో కోట్ల రూపాయల అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ కి ఇండెంట్ పెట్టింది. సెక్యూరిటీ వేలం ద్వారా ఈ అప్పు తెస్తున్నారు. ఈ విధంగా ఇప్పటికి ఆరు సార్లు సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి అప్పులు తేవడం జరుగుతోంది. మరి ఈ అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి. పైగా వీటి కాల పరిమితి కూడా పన్నెండేళ్ళు నుంచి పాతికేళ్ల దాకా ఉంటుంది. అంటే మరి రెండు మూడు తరాలకు సరిపడా ఈ అప్పు అన్న మాట. ఈ విధంగా అప్పులు తేవడం సులువే కానీ తీర్చేటప్పుడు భారంగా ఉంటుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కనుక ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఏడు నెలలు బిగిసి ఉండగానే ఏపీ ప్రభుత్వం ఇంత అప్పు తెస్తే సగటున మిగిలిన నెలలకు దీనిని వేసుకుంటే నెలకు ఏడు వేల కోట్లకు వంతున అర లక్ష కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా చేయడం ఖాయమని అంటున్నారు.
అంటే కూటమి సర్కార్ తొలి ఆర్థిక సంవత్సరం పూర్తి చేసే నాటికి మొత్తం డెబ్బై వేల దాకా అప్పులు చేస్తుందా అన్న చర్చ అయితే ఉంది. ఆ స్పీడ్ దూకుడు చూస్తూంటే ఇదే నిజం అయ్యేలా ఉంది. ఎందుకంటే ఏపీకి ఏ విధంగానూ ఆదాయం లేదు. పైగా వచ్చే రెవిన్యూలో పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి తీసి పెట్టాలి. ఉద్యోగుల జీతాలు సామాజిక పెన్షన్లు కూడా లెక్క తీసి పక్కన పెట్టాలి.
దాంతో కాలు కదిపేందుకు కూడా లేదు అని అంటున్నారు. ఇక ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలను రుణంగానే తీసుకుంటున్నారు అని ప్రచారంలో ఉంది. దానికి కూడా పాతిక నుంచి ముప్పయ్యేళ్ల కాలపరిమితిలో తీర్చాల్సి ఉంటుంది.
ఇక రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఉత్పాదక రంగాల మీద పెట్టడం లేదు. అమరావతిని పక్కన పెడితే సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి తెస్తున్న అప్పులు దైనందిన ఆర్ధిక వ్యవహారాల కోసమే అని అంటున్నారు. దీంతో అప్పులు తప్పడం లేదు అని అంటున్నారు.
అయితే ఈ అప్పుల మీదనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంత అప్పులు తెచ్చి కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదు అని విమర్శిస్తున్నారు మరి ఎందుకు అప్పు చేస్తున్నారు అని కూడా విమర్శిస్తున్నారు. వారి సంగతి అలా ఉంచితే ఏపీలో ఇప్పటికే ఎలా చూసుకున్నా పది లక్షల కోట్లకు పైగా అప్పు ఉంది. అది కాస్తా మరింతగా పెరిగితే ఏపీ అప్పులకు కట్టిన వడ్డీలు తీర్చేందుకే ఏటా వచ్చే రెవిన్యూ సరిపోక ఇబ్బంది పడుతుందని అంటున్నారు. మరి ఏపీలో అప్పులు తగ్గి ఆస్తులు పెరిగేది ఎప్పుడో అన్నదైతే సామాన్యుడికి చింతగానే ఉంది.