టీడీపీలో టికెట్ల లొల్లి.. మరీ ఇంత తీవ్రంగానా?

టికెట్లు ఆశించి భంగపడిన వారు నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు. మరికొందరు అధినేత మీద ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు

Update: 2024-02-26 12:00 GMT

చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించటం ద్వారా సంచలనాన్ని క్రియేట్ చేశారు. చంద్రబాబు గురించి బాగా తెలిసిన వారు సైతం ఆయన తాజా తీరును చూసి విస్మయానికి గురవుతున్న పరిస్థితి. బాబులో ఇంత మార్పా? అంటూ అవాక్కు అవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్లను ఆశించి.. భంగపడిన వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు వస్తాయనుకుంటే రాకుండా పోవటమే ఏమిటన్న ఆవేశంతో చంద్రబాబు పైనా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీదా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

టికెట్లు ఆశించి భంగపడిన వారు నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు. మరికొందరు అధినేత మీద ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జనసేనలోనూ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. మొదటి విడతలో కేటాయించిన టికెట్లు వేళ్ల మీద లెక్కేసేందుకు కూడా తక్కువగా ఉండటాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. పొత్తు లెక్కేమో కానీ ఉభయ పార్టీ అధినేతలకు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

తాజాగా టికెట్ల పంచాయితీ పీక్సుకు చేరింది. కొందరు టీడీపీ నేతలు.. కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కాకినాడ రూరల్ టీడీపీ నేతలు.. కార్యకర్తలు భగ్గుమంటున్నారు. టికెట్ ను జనసేనకు ఎలా కేటాయిస్తారని మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. పార్టీకి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జనసేనకు టికెట్ ఇవ్వటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

పార్టీకి తమ నిరసనను తెలియజేసేందుకు వీలుగా మూకుమ్మడి రాజీనామాలకు పాల్పడాలని డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్త ఒకరు (లోవరాజు) ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయటం.. వెంటనే పోలీసులు అతడ్ని కాపాడారు. ఇదిలా ఉంటే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ధర్నాకు దిగారు. తంబళ్లపల్లి టికెట్ ను శంకర్ యాదవ్ ఆశించనగా.. అందుకు భిన్నంగా జయచంద్రారెడ్డికి కేటాయించటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ రీతిలో వెల్లువెత్తుతున్న నిరసనలు టీడీపీ.. జనసేనలో హాట్ టాపిక్ గా మారాయి.

Tags:    

Similar News