జనసేనతో టీడీపీకి బిగ్ టాస్క్...?
ఇపుడు టీడీపీ జనసేనతో పొత్తు అంటోంది. జనసేన బేసికల్ గా పార్టీగా కంటే పవన్ చుట్టూ ఆయన ఫ్యాన్స్ అల్లుకున్న ఏమోషనల్ బాండింగ్ గానే చూడాలి.
పొత్తులు కుదరడం అన్నది పై స్థాయిలో జరిగిపోయింది. దానికి ఇద్దరు నాయకులు కలిస్తే చాలు కీలక ప్రకటన చేసేయవచ్చు. మేము ఒక్కటి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చేయవచ్చు. అలా కుదిరిన పొత్తులు గ్రౌండ్ లెవెల్ లో ఎంతవరకూ వర్కౌట్ అవుతాయన్నదే ఇక్కడ కీలకంగా చూడాల్సిన విషయం. ఏపీలో జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో ఎన్నో కొత్త కోణాలు ఉన్నాయి.
టీడీపీ చరిత్రలో పొత్తు పెట్టుకున్న పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జనసేనతో టీడీపీ తొలి అనుభవం ఏంటి అంటే జనసేన జూనియర్ పార్టనర్ కాదు, ఇప్పటిదాకా టీడీపీ పొత్తులు పెట్టుకున్న పార్టీలు అన్నీ కూడా ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటితో సర్దుకుపోయే పార్టీలే. బీజేపీ అయినా కామ్రేడ్స్ అయినా ఎక్కువ సీట్లు అయితే టీడీపీ ఇచ్చిందీ లేదు, ఆయా పార్టీలు పుచ్చుకున్నదీ లేదు.
ఇక కాంగ్రేస్ విషయం తీసుకుంటే వారు ఓట్ల బదిలీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. ఒక్క ఓటు కూడా అటు నుంచి ఇటు పొల్లుపోకుండా ఎవరికి వేయాలో వారికే పడుతుంది. ఇక బీజేపీ విషయం తీసుకున్నా ఆ పార్టీ నుంచి కూడా ఓటింగ్ షిఫ్ట్ కావడం అన్నది సజావుగానే సాగుతుంది అని గడిచిన ఎన్నికలు నిరూపించాయి.
ఇపుడు టీడీపీ జనసేనతో పొత్తు అంటోంది. జనసేన బేసికల్ గా పార్టీగా కంటే పవన్ చుట్టూ ఆయన ఫ్యాన్స్ అల్లుకున్న ఏమోషనల్ బాండింగ్ గానే చూడాలి. వారు పవన్ చుట్టూనే తిరుగుతారు. పవన్ నే చూస్తారు. పవన్ కోసమే ఉంటారు. అలాంటి వాతావరణమే జనసేనలో ఉంది.
మరో వైపు చూస్తే జనసేనలో పార్టీ స్త్రక్చర్ కూడా అంతగా ఉండదు. దానికి తోడు వారికి హీరో వర్షిప్ జనాలే ఉంటారు. వారికి పవన్ కావాలి. అంతే తప్ప పవన్ చెప్పారని వేరే పార్టీకి ఓటు వేసే సీన్ అయితే ఉండదనే అంటున్నారు. ఇక జనసేనకు ఇది రెండవ ఎన్నిక. తొలి ఎన్నిక తీసుకుంటే పొత్తులు పెట్టుకుని 2019 ఎన్నికల్లో పోటీ చేసింది. అయితే నాడు పవన్ సీఎం అంటూ బరిలోకి దిగింది. కాబట్టి ఓట్ల బదిలీ ఇష్యూ కాలేదు.
దానికి ఉదాహరణ ఏంటి అంటే కొన్ని చోట్ల బీఎప్సీకి, కామ్రేడ్స్ కి వచ్చిన వేల ఓట్లు. అంటే జనసేన అభిమానులు క్యాడర్ పవన్ సీఎం కావాలని కోరుకుంటూ ఆయన పార్టీలకు ఓట్లు వేశారు అన్న మాట. ఇపుడు అసలైన కధ ఉంది. టీడీపీ జనసేన పొత్తులో పెద్ద పార్టీ టీడీపీ. కూటమి గెలిస్తే బాబు సీఎం అవుతారు. ఇది ఎవరి ఎవరికీ చెప్పాల్సిన పని లేదు.
మరి దీంతో జనసేన ఓట్ల బదిలీ అవుతుందా. ఎమోషనల్ టచ్ ఉంటుందా అన్నదే కీలకమైన అంశం. పైగా జనసేన అభిమానులకు హీరో పవన్ అని అందరికీ తెలుసు. తమ హీరో సీఎం అవుతారు అనుకుంటే వారు వేసే ఓటింగ్ ఒకలా ఉంటుంది. లేకపోతే మరోలా ఉంటుంది. ఇక జనసేన ఎమోషన్ ని క్యారీ చేసే పరిస్థితులు క్షేత్ర స్థాయిలో ఉన్నాయా అన్నది కూడా ఇక్కడ కీలకమైన పాయింట్.
రెండు పార్టీల మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉన్నా జనసేన సైనికుల బాధ వేదన అన్నది పవన్ సీఎం కావడమే. అందువల్ల ఓట్ల బదిలీ అన్నది బిగ్ టాస్క్ గానే టీడీపీకి ఉంటుంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకూ మూడు రోజుల పాటు జనసేన టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు జరపనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఈ సమావేశాలకు జనసేన తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇన్చార్జులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులతో కలిపి 50 మంది వరకు సమన్వయ సమావేశంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. రెండు పార్టీలు కలవకూడదన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని వారి ఉచ్చులో పడొద్దంటూ పార్టీ శ్రేణులను నాదెండ్ల అప్రమత్తం చేస్తున్నారు.
అయితే నాదెండ్ల చెప్పడం కాదు ప్రత్యర్ధి ఎత్తులు కుట్రలు అన్నది కూడా పాయింట్ కానే కాదు, జనసేన క్యాడర్ కి ఎమోషనల్ బాండింగ్ అన్నది ఉంది. అది పవన్ తోనే ఉంది. పవన్ కోసమే వారు ఏమైనా చేస్తారు. వద్దన్నా కూడా చేస్తారు. పవన్ సీఎం అన్న ఒకే ఒక్క మాట వారికి తారకమంత్రంగా ఉంటుంది. దానికి మించి ఎమోషనల్ కనెక్షన్ జనసేన క్యాడర్ లో రగిలించి వారికి పూర్తిగా టీడీపీ వైపుగా షిఫ్ట్ చేయగలితే మాత్రం అది అద్భుతం అవుతుంది. అపుడు పొత్తు సూపర్ హిట్ అవుతుంది. చూడాలి మరి జనసేన విషయంలో టీడీపీ వ్యూహాలు ఎలా ఉంటాయో.