బీజేపీ-టీడీపీ-- తెరచాటు 'దూరం'!!
ఎక్కడైనా రాజకీయ పక్షాలు తెరచాటు స్నేహం చేయడం తెలిసిందే. నాయకులు కూడా ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నప్పుడు
ఎక్కడైనా రాజకీయ పక్షాలు తెరచాటు స్నేహం చేయడం తెలిసిందే. నాయకులు కూడా ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల్లో ఉన్నప్పుడు.. ఎన్నికల వరకు ఎలా పోరాడుకున్నా.. ఎన్నికల తర్వాత.. మాత్రం కొందరు తెరచాటు స్నేహంతో ముందుకు సాగుతారు. ఇది ఏపీలోనూ కామనే. అందుకే.. ప్రభుత్వం ఏది ఉన్నా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం చాలా వరకు కూల్‌గా ఉంటుంది. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో కూటమిగా ఉన్న బీజేపీ-టీడీపీల మధ్య తెరచాటు దూరం కనిపిస్తోందని అంటున్నారు.
ఈఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. బీజేపీతో టీడీపీ జట్టుకట్టింది. ఏకంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలను కూడా అప్పగించింది. మోడీతో కలిసి చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. ప్రభుత్వం ఏర్ప డింది. మంత్రివర్గంలోనూ బీజేపీ నాయకుడు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌కు అవకాశం ఇచ్చారు. మంచి పోర్టు ఫోలియోను కూడా అప్పగించారు. అంతా బాగానే ఉందికదా! మరి `దూరం` మాటేంటి? అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందనేది ఆసక్తిగా మారింది.
రెండు కీలక విషయాల్లో టీడీపీ-బీజేపీ రాష్ట్ర నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఒకటి ఎన్నికలకు ముం దు కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోపై బీజేపీ నేతలు మౌనంగాఉండడం. అంతేకాదు.. నేరుగా పార్టీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి.. తనకు, ఈ హామీలకు సంబంధం లేదని తేటతెల్లం చేయడం వంటివి కొంత వరకు టీడీపీలో చర్చనీయాంశం అయ్యాయి. ఆమె ఆయా పథకాలను అమలు చేయకపోవచ్చు. లేదా.. మరే కారణమైనా ఉండొచ్చు. కానీ, తమకు సంబంధం లేదనడం ద్వారా.. క్షేత్రస్థాయిలో సర్కారును ఇరుకున పెట్టారు.
ఇక, రెండో కారణం.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు త్వరలోనే ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌లో కేటాయింపులు ఎక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీ మాత్రం కనీస ప్రయత్నం చేయడం లేదు. దీంతో బీజేపీ వ్యవహారంపై టీడీపీలో కొంత ఆవేదన, ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక, మూడో పరిణామం గమనిస్తే.. తాజాగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా.. చంద్రబాబు కూటమి పార్టీల ఎంపీలకు కొన్ని బాధ్యతలను, శాఖలను అప్పగించారు.
అయితే.. బీజేపీ ఎంపీలకు ఈ జాబితాలో ఆయన చోటు పెట్టకపోవడం గమనార్హం. కేవలం టీడీపీ-జనసేన ఇద్దరు ఎంపీలకు మాత్రమే చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. మరి బీజేపీ తరఫున గెలిచిన నలుగురు ఎంపీలను ఎందుకు పక్కన పెట్టారనేది ప్రశ్న. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ-టీడీపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ సాగుతోంది.