విధ్వంసానికి టీడీపీ భారీ కుట్ర? హాట్ చర్చలో నిజమెంత?

బాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ వర్గాలు భారీఎత్తున అల్లర్లకు స్కెచ్ వేశారంటూ ప్రచారం సాగుతోంది.

Update: 2023-09-16 03:45 GMT

స్కిల్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు అరెస్టు కావటం తెలిసిందే. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని జైల్లో ఉన్న ఆయన బెయిల్ కోసం పాట్లు పడుతున్నా.. అందుకు తగ్గట్లుగా ఫలితాలు రాని పరిస్థితి. చంద్రబాబు అన్నంతనే కోర్టులను మేనేజ్ చేయటంలో ఆయనకు మించినోళ్లు లేరన్న మాట ఆయన రాజకీయ ప్రత్యర్థుల నోటి నుంచి తరచూ వస్తూ ఉంటుంది. మరి.. నిజంగానే బాబుకు కోర్టుల్ని మేనేజ్ చేసే సత్తా ఉంటే.. ఒక కేసులో ఆయనకు వరుస ఎదురుదెబ్బలు ఎందుకు తగులుతున్నట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. చంద్రబాబు అరెస్టు సందర్భంగా క్యాడర్ లోనూ.. రాష్ట్ర ప్రజల్లోనూ సరైన స్పందన లేదన్న మాట తరచూ వినిపించటం తెలిసిందే. అయితే.. అందులో నిజం ఎంత? అన్నది ఒక చర్చ అయితే.. తాజాగా సోషల్ మీడియాలో మరో పోస్టు కొత్త చర్చకు తెర తీసింది. బాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ వర్గాలు భారీఎత్తున అల్లర్లకు స్కెచ్ వేశారంటూ ప్రచారం సాగుతోంది.

అందుకు స్టూడెంట్లు.. యూత్ ను పావులుగా వాడుకోనున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. అరెస్టు చేసిన గంటల వ్యవధిలోనే చేస్తారు తప్పించి..అరెస్టు అయి.. జైల్లో రిమాండ్ ఖైదీలా ఉన్న తర్వాత ఎలా చేయగలరన్నది ప్రశ్న. అల్లర్లకు ముందు తీవ్రమైన భావోద్వేగ పరిస్థితులు చోటు చేసుకున్న వేళ్ల.. దాడులు చేసే వీలుంది. అరెస్టు అయి దాదాపు వారం కావొస్తున్న వేళ.. ఇప్పుడు అల్లర్లకు పాల్పడితే నష్టం టీడీపీకే అన్న విషయం తెలుగుదేశం పార్టీ నేతలకు తెలీదా? అన్నది ప్రశ్న.

దీనికి తోడు ఏపీ ప్రభుత్వం శాంతిభద్రతల విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వేళ.. ఏపీలో ఆందోళనలు చేసే ప్రయత్నాలు జరగట్లేదంటున్నారు. నిజానికి హైదరాబాద్ లోని విప్రో సర్కిల్ వద్ద.. కేపీహెచ్ బీ వద్ద జరిగిన ఆందోళల్లో 10వేలకు తగ్గకుండా హాజరు కావటం హాట్ టాపిక్ గా మారింది. అంత భారీగా హాజరు కావటం చూస్తే.. ఈ మాత్రం జనాలతో ఆందోళన ఏపీలో జరిగింది లేదని చెబుతున్నారు. అలాంటప్పుడు అల్లర్లకు స్కెచ్ వేసేంత సీన్ టీడీపీకి ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

అంతేకాదు.. అల్లర్లకు జాతీయ రహదారుల్ని వేదికగా చేసుకుంటారన్నప్రచారంలోనూ అర్థం లేనిదని చెప్పాలి. ఎందుకంటే.. జాతీయ రహదారుల మీద అల్లర్లు చేస్తే.. కంట్రోల్ చేయటం పోలీసులకు మరింత ఈజీ. ఎందుకంటే.. స్థాయి దాటిన అల్లర్ల వేళ.. పోలీసులు మరింత కటువుగా రియాక్టు అయ్యే వీలుంటుంది. దీనికి తోడు నేషనల్ హైవేల మీద చిన్న షాపులు.. దాబాలు.. హోటళ్లు మాత్రమే ఉంటాయి. వీటిపై ప్రతీకారం తీర్చుకోవటం ద్వారా లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న చిన్న విషయం టీడీపీ వర్గాలకు తెలీదా? అని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు బాబు అరెస్టు వేళ స్పందన లేదన్న ప్రచారం చేస్తూనే.. మరోవైపు భారీ విధ్వంసానికి స్కెచ్ వేస్తున్నట్లుగా సోషల్ పోస్టులు పెట్టటంలోని అంతర్యం ఇట్టే అర్థం చేసుకోవచ్చంటున్నారు.

Tags:    

Similar News