జయహో బీసీ.. టీడీపీ యాత్ర స్టార్ట్.. ఎప్పటి నుంచంటే!
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'జయహో బీసీ' పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా బీసీలను చైతన్య పరచనుంది. ప్రస్తుత వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని.. వారిలో చైతన్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే జయహో బీసీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తెలిపారు. జనవ రి 4వ తేదీ నుంచి ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తాజాగా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో మీడియాతోమాట్లాడిన నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విమ ర్శలు గుప్పించారు. అదేసమయంలో జయహో బీసీ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. 'జయహో బీసీ' కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగుతుందన్నారు. తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవ ర్గాలు, మండలాల్లో టీడీపీ నేతలు పర్యటిస్తారని చెప్పారు.
క్షేత్రస్థాయి పర్యటనలోనే బీసీల కష్టాలు తెలుసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేస్తారని నారా లోకేష్ వివరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ సోదరులను ఇబ్బంది పెట్టారన్న నారా లోకేష్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించారని అన్నారు. 16 వేల మంది బీసీలకు అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు.
చంద్రబాబు హయాంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 'ఆదరణ' పథకాన్ని జగన్ రద్దు చేశారని అన్నారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు అందలేదని యువగళం పాదయాత్రలో చెప్పారని నారా లోకేష్ తెలిపారు. పట్టు రైతులకు కనీసం సబ్సిడీ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదని విమర్శించారు. బీసీ సోదరుల తరఫున పోరాడుతున్న టీడీపీ బీసీ నేతలపై కేసు పెట్టి వేధించారని అన్నారు.
టీడీపీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, కొల్లు రవీంద్ర, అచ్చెనాయుడుపై అక్రమ కేసులు పెట్టారని, ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్యను చంపేశారని వైసీపీ సర్కారుపై నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ''బీసీలు బలహీనులు కాదు.. బలవంతులన్నదే తెలుగుదేశం నినాదం. పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించింది. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యమిచ్చాం'' అని లోకేష్ వివరించారు.