లాస్ట్ అసెంబ్లీ... టీడీపీ దుమ్ము రేపనుందా...!?

అయితే వైసీపీ ఉద్దేశ్యాలు నెరవేరకుండా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తోంది.;

Update: 2024-02-05 03:59 GMT

జగన్ నాయకత్వంలో 2019లో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వానికి ఇవి చిట్ట చివరి అసెంబ్లీ సమావేశాలు. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని కేవలం మూడు నెలలకు మాత్రమే ప్రభుత్వం ఈ సమావేశాలలో ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది బీఏసీలో నిర్ణయిస్తారు.

అయితే ఈ సమావేశాలను అతి త్వరలో రానున్న ఎన్నికలలకు వేదికగా ఉపయోగించుకోవాలని వైసీపీ చూస్తోంది. అయిదేళ్ల తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమం అన్న దాన్ని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ఒక్కో రంగం గురించి సుదీర్ఘంగా వివరించే ప్రసంగాలు చేస్తారని అంటున్నారు.

అయితే వైసీపీ ఉద్దేశ్యాలు నెరవేరకుండా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. అసెంబ్లీలో వైసీపీ అయిదేళ్ల పాలనలో చేసిన తప్పులను ఎండగట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అయిన తెలుగుదేశం శాసనసభా పక్షం వైసీపీ ప్రభుత్వాన్ని పూర్తిగా ఇరకాటంలో పెట్టేలా బడ్జెట్ సెషన్ లో వ్యవహరించాలని నిర్ణయించింది.

ప్రజా కోర్టు పేరుతో విడుదల చేసిన చార్జిషీటు ద్వారా వైసీపీ ప్రభుత్వం గత అయిదేళ్ళలో అమలు చేయని హామీలు. ప్రజలను ఇబ్బంది పెట్టిన వైనాలు అన్నీ కూడా రూపొందించారు. ఆ పుస్తకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు రిలీజ్ చేశారు. రెండు నెలలు ఆగితే చాలు ప్రజా కోర్టులో జగన్ కి శిక్ష తప్పదని చంద్రబాబు జోస్యం చెప్పారు.

మొత్తానికి మొత్తం హామీలను గలైకి వదిలేసి తాను 99 శాతం హామీలు అమలుచేశాను అని జగన్ ఎలా చెప్పుకుంటారు అని ఆయన నిలదీశారు. జగన్ అమలు చేయని హామీలు ఏంటో ప్రజా కోర్టు పుస్తకంలో ఉన్నాయని ఇవే అంశాల మీద అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.

ఇక వైసీపీ 2019 ఎన్నికల వేళ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోతో పాటు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నీ కలిపి మొత్తం 730 హామీలు జగన్ ఇచ్చారని బాబు గుర్తు చేశారు. అయితే వాటిలో 21 శాతం కూడా అమలు చేయకుండా 99 శాతం అమలు చేశానంటూ ప్రజల్ని వంచిస్తున్నాడని బాబు మండిపడ్డారు. జగన్ అన్నీ కూడా మోసపూరిత మాటలతో ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారని అన్నారు.

ఏపీలో తాము అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చి మాట తప్పిన నేత జగన్ అన్నారు. అంతే కాదు ఈ రూపేణా ఏకంగా 64 వేల కోట్ల రూపాయల భారం మోపారని విమర్శించారు. అదే విధంగా సంపూర్ణ మద్య నిషేధం హామీని అటకెక్కించి మద్యం అమ్మకాలపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారని ఆరోపించారు.

ఇక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ గాలికొదిలేశారని, అదే విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై గడచిన అయిదేళ్ల కాలంలో ఏకంగా ఎనిమిది లక్షల రూపాయల భారం జగన్ మోపారని బాబు ఫైర్ అయ్యారు. జగన్ ని మించిన ఫెయిల్యూర్ సీఎం దేశంలో లేరని, అదే ఆయనకు ఉన్న రికార్డు అని కూడా ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News