ఇపుడు వస్తే ఏం లాభం చినబాబూ...?

నారా లోకేష్ కి ఒక గోల్డెన్ చాన్స్ వచ్చింది.

Update: 2023-10-01 03:49 GMT

నారా లోకేష్ కి ఒక గోల్డెన్ చాన్స్ వచ్చింది. తన తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయి జైలు గోడల మధ్యన ఉన్నపుడు పార్టీకి కష్ట కాలం వచ్చినపుడు సంక్షోభంలో పార్టీ ఉన్నపుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని తనను తాను రుజువు చేసుకోవాల్సిన అవకాశాన్ని వైసీపీ కల్పించింది. చంద్రబాబు తరచూ అనే సంక్షోభాల నుంచే అవకాశాలు అన్న మాట బహుశా లోకేష్ కరెక్ట్ గా విని ఉంటే ఈ పాటికి ఏపీలో టీడీపీ సౌండ్ వేరేగా ఉండేది.

కేవలం చంద్రబాబు అరెస్ట్ అయిన మూడు వారాల తరువాత కంచాలు పళ్ళేలతో సౌండ్ చేసే విధంగా అయితే ఉండి ఉండదు. తండ్రి అరెస్ట్ అయినపుడు నా తండ్రిని చూడనివ్వకుండా అడ్డుకుంటారా అని గోదావరి జిల్లాలో పోలీసులతో లోకేష్ మండిపడిన తీరుని చూసిన వారు చినబాబు ఇక విశ్వరూపం చూపిస్తారు అని భావించారు.

కానీ ఆ తరువాత ఆ ఆవేశం ఏమైంది అన్నది తమ్ముళ్లకు కూడా తెలియని పరిస్థితి ఉంది అంటున్నారు. రాజమండ్రి క్యాంప్ లో కొన్ని రోజులు ఉన్న లోకేష్ బాబు సెప్టెంబర్ 14న ఢిల్లీ వెళ్లిపోయారు. ఆయన అది లగాయితూ అక్కడే ఉంటూ వచ్చారు. మొదట్లో న్యాయ నిపుణులతో చర్చల కోసం వెళ్లారు అని టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తూ వచ్చింది.

అయితే వ్యతిరేక మీడియా మాత్రం సీఐడీ అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే అని రాస్తూ వచ్చింది. చివరికి లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో అదే నిజమని నమ్మాల్సీ వచ్చింది అని అంటున్నారు. ఇక సీఐడీ అధికారులు ఢిల్లీ వెళ్లి మరీ లోకేష్ కి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చారు.

దాని మీద మీడియాతో మాట్లాడిన లోకేష్ తాను పారిపోయే రకం కాదని అన్నారు. అక్టోబర్ 4న తప్పనిసరిగా వచ్చి సీఐడీ విచారణను ఎదుర్కొంటాను అన్నారు. తాను విదేశాలకు పారిపోయాను అని వ్యతిరేక మీడియా ప్రచారం చేస్తోంది అని మండిపడ్డారు. సరే వ్యతిరేకులు ఎపుడూ అలాగే ప్రచారం చేస్తారు అనుకున్నా నిజానికి లోకేష్ మూడు వారాలుగా ఢిల్లీలో ఉంటూ పార్టీని గాలికి వదిలేసిన సంగతిని చూసిన వారు మాత్రం ఏమనుకుంటారో ఆయనకే తెలియాలి అంటున్నారు.

తాను అరెస్టులకు భయపడేది లేదు అని ఢిల్లీ మీడియా ముందు కాకుండా గల్లీ మీడియా ముందు చెబుతూ పాదయాత్రను కంటిన్యూ చేస్తూ వైసీపీ మీద నిప్పులు చెరుగుతూ తన తండ్రి అరెస్ట్ విషయంలో జనంలో చర్చకు పెడితే అపుడు కచ్చితంగా జనాల సంగతి అటుంచినా పార్టీ క్యాడర్ కి ఒక నైతిక ధైర్యం వచ్చేది.

కానీ లోకేష్ ఢిల్లీలో ఉంటే ట్విట్టర్ ద్వారా బ్రాహ్మణి భువనేశ్వరి పార్టీని నడిపించడం అంటే నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన టీడీపీకి అది అసలైన ఇబ్బంది అనే అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ కంటే ఇది పార్టీని దెబ్బ తీసిన అతి పెద్ద ముప్పు అని కూడా అంటున్నారు. ఇన్నీ అయ్యాక ఇంతా జరిగాక బాబు అరెస్ట్ మీద జనంలో చర్చల వేడి చప్పబడ్డాక లోకేష్ ఏపీకి వచ్చి సీఐడీ విచారణ ఎదుర్కొన్నా లేక అరెస్ట్ అయినా ఆ ఇంపాక్ట్ అయితే ఊహించినంతగా ఉండదనే అంటున్నారు.

మొత్తానికి చూస్తే లోకేష్ గోల్డెన్ చాన్స్ మిస్ అయ్యారనే అంటున్నారు. చంద్రబాబుకు తొందరలో బెయిల్ రావచ్చు. లేదా క్వాష్ పిటిషన్ కొట్టేసినా ఊరట దక్కవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ అనుకున్నది మాత్రం ఒకటి సక్సెస్ అయింది అంటున్నారు. అదే చంద్రబాబు లేని టీడీపీ చుక్కాని లేని నావగా మారుతుందని. అదే ఇపుడు కంటికి కనిపించేలా పార్టీ నేతల నిర్వాకంతో తెలిసింది అని అంటున్నారు.

Tags:    

Similar News