మహానాడు వాయిదా వెనక మతలబేంటి ?

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇది కొనసాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో దానిని వాయిదా వేయడంతో చర్చ మొదలయింది.

Update: 2024-05-17 07:35 GMT

పసుపు పార్టీ టీడీపీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు వేడుకలను ఈసారి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాయిదా వేశారు. ప్రతి ఏటా రెండు లేదా మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన తీర్మానాలు చేయడం ఆనవాయితీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇది కొనసాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో దానిని వాయిదా వేయడంతో చర్చ మొదలయింది.

కరోనా కారణంగా రెండేళ్లపాటు అసలు మహానాడును పార్టీ నిర్వహించలేదు. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు వచ్చి టీడీపీ విజయం సాధించినా మహానాడును నిర్వహించలేదు. 2019 మే 23న ఎన్నికల ఫలితాలలో టీడీపీ పరాజయం పాలయింది. దీంతో అప్పుడు కూడా మహానాడును నిర్వహించుకోలేదు. రెండేళ్ల క్రితం 2022లో ప్రకాశం జిల్లాలో, 2023లో రాజమండ్రిలో మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నిర్వహించింది.

ఈ ఏడాది మే 13తో తెలంగాణ, ఆంధ్రలలో పోలింగ్ ముగిసింది. జూన్ 4న శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ప్రతి ఏటా మే నెల 27 - 29 తేదీల మధ్యన మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ సారి జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్దం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 60 రోజుల ఎన్నికల ప్రచారంలో రాత్రి, పగలు కష్టపడి పనిచేసిన లీడర్లు, క్యాడర్ ఇప్పుడు రిలాక్స్ మోడ్ లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వెనువెంటనే మహానాడు అంటే రాష్ట్రవ్యాప్తంగా శ్రేణులను సిద్ధం చేయాలి. ఎన్నికల తరువాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య కూడా నెలకొన్నది. ఇప్పుడు మహానాడు అంటే దాని ప్రభావం కౌంటింగ్ మీద పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే కేవలం గ్రామగ్రామాన పార్టీ జెండాలు ఎగురవేసి రక్తదానాలు, అన్నదానాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూన్ 4 ఎన్నికల ఫలితాలను బట్టి మహానాడు భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News