వైసీపీకి చాన్స్ ఇచ్చేస్తున్న టీడీపీ ?

రాజకీయాల్లో చాన్స్ ఇవ్వడం అంటే ఎవరికీ అంత తొందరగా మనస్కరించదు.

Update: 2024-08-10 14:30 GMT

రాజకీయాల్లో చాన్స్ ఇవ్వడం అంటే ఎవరికీ అంత తొందరగా మనస్కరించదు. కానీ పరిస్థితులు అలా ఉన్నపుడు ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ ని వాడుతూంటారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది.

మొత్తం 838 ఓట్లన్లో ఎటు నుంచి ఎలా చూసుకున్నా టీడీపీ కూటమి ఓట్లు 250కి మించి లేకపోవడం విజయం సాధించాలంటే కచ్చితంగా మరో 150 ఓట్లు కావాల్సి రావడంతో ఈ కీలక టైం లో ఏమి చేయాలి అన్నదే టీడీపీ కూటమి పెద్దలు మధనపడుతున్నారు.

ఇప్పటికే వైసీపీ అలెర్ట్ అయిపోయింది. జగన్ నేరుగా రంగంలోకి దిగారు. తమ పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను క్యాంప్ కు తరలించారు అని అంటున్నారు. ఇక మరి కొంతమంది మిగిలినా వారు కూటమి వైపు వస్తామని అంటున్నా ఎంత చూసుకున్నా టైట్ గానే పొజిషన్ ఉందని అంటున్నారు.

ఇంతటి హైరిస్క్ చేసినా ఒక వేళ ఓటమి పాలు అయితే పూర్తిగా అభాసుపాలు అవుతామన్న ఆందోళన కూడా కూటమి నేతలలో ఉంది. ఇంతా చేస్తే జస్ట్ ఒక ఎమ్మెల్సీ సీటు కోసం. భారీ స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి ఫిరాయింపులకు తెర తీసినా ఫలితం అనుకూలంగా రాకపోతే వైసీపీని కోరి పెంచిన వాళ్ళమవుతామని కూడా ఆలోచిస్తున్నారు.

అదే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే వైసీపీ గెలిచినా అది ఒంటి చేతిలో చప్పట్లుగానే మిగిలిపోతుందని ఆ గెలుపుకు ఎవరూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది. ఇంత తొందరలోనే ఒక ఎన్నికకు కోరి ప్రతిష్టాత్మకం చేసుకుని వైసీపీతో ఢీ కొట్టి ఓటమి తెచ్చుకుంటే వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని జనాల్లో కోరి చెప్పి ఆ పార్టీ బలాన్ని పెంచినట్లు అవుతుందని భావిస్తున్నారుట.

అదే సమయంలో వైసీపీ క్యాడర్ లో కూడా కొత్త ధైర్యాన్ని పెంచిన వారమవుతామని కూడా ఆలోచిస్తున్నారుట. అందుకే కూటమిలోని మూడు పార్టీల ముఖ్యులతో ఒక కమిటీని టీడీపీ అధినాయకత్వం వేసింది. ఈ కమిటీ మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి విశాఖ రూరల్ లో ఏజెన్సీలో అర్బన్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, వారిలో ఎంత మంది సానుకూలంగా కూటమి వైపు ఉన్నారు అన్నది అన్నీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఈ కమిటీని కోరినట్లుగా చెబుతున్నారు.

మరో వైపు చూస్తే కూటమిలో ఉన్న కొందరు నేతలు పోటీకి సై అని అంటూంటే మరి కొందరు మాత్రం వద్దు అనే అంటున్నారు. ఇక పోటీకి అంటూ దిగితే కచ్చితంగా క్యాంప్ పాలిటిక్స్ ని కొనసాగించాలి. దానికి కావాల్సిన అర్ధ బలం అంగబలం ఎవరు సమకూరుస్తారు ఎవరు మేము అంతా చూసుకుంటామని పూచీకత్తు ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ వైపు చూసుకుంటే ఆ పార్టీ అభ్యర్ధిగా ఈ నెల 12న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేస్తున్నారు.

మరో వైపు రెండు రోజులు మాత్రమే నామినేషన్ల స్వీకరణ ఘట్టానికి గడువు ఉంది. కూటమి ఈ రెండు రోజులలో ఏదో ఒకటి తేల్చుకోకపోతే మాత్రం వైసీపీకి ఇది గోల్డెన్ చాన్స్ అని అంటున్నారు. బొత్స ఏకగ్రీవంగా గెలిచి పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News