పోలింగ్ వేళ టీడీపీ హెడ్డాఫీసులో 'సెంట్రల్ వార్ రూం'

పార్టీ నేతలు.. కార్యకర్తలంతా కూడా వారి ప్రాంతాల్లో చివరి ఓటు పోలయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా.. ప్రత్యర్థులు వ్యవహరించే వీలుందని హెచ్చరించారు.

Update: 2024-05-13 05:41 GMT

హోరాహోరీగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన అత్యంత కీలకమైన రోజు ఇది. ఇన్నాళ్లు చేసిన ప్రచారానికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఈ రోజున (సోమవారం) ఈవీఎంల్లోనిక్షిప్తం కానుంది. వచ్చే నెల (జూన్) నాలుగున ఓటర్లు ఇచ్చిన తీర్పు వెల్లడి కానుంది. ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ వేళలో చోటు చేసుకునే పరిణామాలకు వెంటనే స్పందించేందుకు వీలుగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా తన పార్టీ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ సెంట్రల్ వార్ రూంను ఏర్పాటు చేసింది.

ఓటమి భయంతో అధికార వైసీపీ నుంచి ఊహించని రీతిలో ఎదురయ్యే పరిణామాలకు ధీటుగా స్పందించేందుకు వీలుగా ఈ వార్ రూంను ఏర్పాటు చేయనున్నట్లుగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సరళి ఏ రీతిలో ఉందనన విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు వీలుగా ఈ వార్ రూంను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.

వార్ రూంను ఏర్పాటు చేసిన అనంతరం.. అక్కడ పని చేస్తున్న వారికి కీలక సూచనలు ఇచచారు. ఓటు వేసిన తర్వాత తాను కూడా అదే వార్ రూంలోనే ఉంటానని.. చివరి ఓటు పోల్ అయ్యే వరకు తాను ఉంటానని పేర్కొన్నారు. పార్టీ నేతలు.. కార్యకర్తలంతా కూడా వారి ప్రాంతాల్లో చివరి ఓటు పోలయ్యే వరకు అక్కడే ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా.. ప్రత్యర్థులు వ్యవహరించే వీలుందని హెచ్చరించారు.

టీడీపీ సానుభూతిపరులను.. తటస్థులను ఓటు వేయనివ్వకుండా చేసే ప్రమాదం ఉందన్న చంద్రబాబు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రా స్థాయి వరకు నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో వచ్చే సమస్యల్ని వార్ రూం టీంకు సమాచారం అందిస్తే... తాము ఆయా జిల్లాల కలెక్టర్లకు.. ఆర్వోలకు ఎన్నికల పరిశీలకుల ద్రష్టికి విషయాల్ని తీసుకెళతామని పేర్కొన్నారు.

ఏజెంట్లుగా వెళ్లే వారు సైతం అన్ని విషయాన్ని గుర్తిస్తూ ఉండాలన్నారు. తప్పుడు లేఖలు.. వదంతులు.. హింసా రాజకీయాలకు పాల్పడే వారి కుట్రలను తిప్పి కొట్టేందుకు వీలుగా సన్నద్దం కావాలన్నారు. మరోవైపు.. అధికార వైసీపీ సైతం పోలింగ్ వేళ.. తమ క్యాడర్ ను జాగ్రత్తగా ఉండాలని.. ప్రత్యర్థి పార్టీ పనుల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలని పేర్కొంది. ఎన్నికల్లో విజయం కోసం తప్పుడు మార్గాల్ని అనుసరించే వీలుందని.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మొత్తంగా అధికార.. విపక్షాలు అలెర్టుగా ఉండాలని తమ వారికి సూచన చేస్తున్న వేళ.. ఎన్నికల పోలింగ్ ఏ రీతిలో సాగుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పాలి.

Tags:    

Similar News