ఈ ఐదుగురు కీలక నేతలపైనే టీడీపీ గురి!

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అధినేత ఉధృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Update: 2024-04-18 23:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల అధినేత ఉధృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తలపడుతున్నారు. ఓవైపు వైసీపీ అధినేత జగన్‌.. మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ హెలికాప్టర్‌ తో రాష్ట్రాన్ని చుడుతున్నారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.

కాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈసారి వైసీపీకి చెందిన ఐదుగురు కీలక నేతలపై టీడీపీ దృష్టి సారించిందని టాక్‌ నడుస్తోంది. ఈ ఐదుగురిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కంకణం కట్టుకుందని చెబుతున్నారు. వీరిలో నలుగురు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వైసీపీ తరఫున విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాశ్, గన్నవరం నుంచి బరిలో ఉన్న వల్లభనేని వంశీమోహన్, గుడివాడ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని, విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని నానిలను చిత్తుగా ఓడించాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు.

వీరిలో దేవినేని అవినాశ్‌ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీలో చేరారు. మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం విధ్వంసం దేవినేని అవినాశ్‌ చేయించారని టీడీపీ ఆయనపై గుస్సాగా ఉందని అంటున్నారు. విజయవాడ తూర్పులో టీడీపీ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ పోటీ చేస్తున్నారు, 2014, 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ తరఫున వరుసగా గెలుపొందారు. మరోసారి గద్దె గెలుపు ఖాయమని టీడీపీ అంచనాలు వేసుకుంటోంది.

ఇక వల్లభనేని వంశీ గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. కొద్ది రోజులకే వైసీపీ పంచన చేరారు. చంద్రబాబు, లోకేశ్‌ లక్ష్యంగా తీవ్ర దూషణలు చేయడంతోపాటు చంద్రబాబు సతీమణిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు అప్పట్లో వంశీపై మండిపడ్డారు. వంశీ తలనరికితే రూ.50 లక్షలు ఇస్తానంటూ ఖమ్మంకు చెందిన టీడీపీ నేత ఒకరు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు.

మరోవైపు గన్నవరంలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయించడం, టీడీపీ కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు బనాయించడం వంటివి వల్లభనేని వంశీ చేయించారని టీడీపీ ఆయనను లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వల్లభనేని వంశీని చిత్తుగా ఓడించడానికి వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకటరావుకు టీడీపీ సీటు ఇచ్చింది. గత ఎన్నికల్లో యార్లగడ్డ... వంశీకి గట్టి పోటీ ఇచ్చారు. అతి తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. ఈసారి ఈ లెక్కను సరిచేయాలని చూస్తున్నారు.

ఇక కేశినేని నాని టీడీపీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా గెలుపొందారు. గత ఎన్నికల్లో గెలిచాక టీడీపీ అధినేత చంద్రబాబును, పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టారని కేశినేనిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆయనకు సీటు నిరాకరించారు. విజయవాడ ఎంపీ సీటును నాని తమ్ముడు కేశినేని చిన్నికి ఇచ్చారు. దీంతో వైసీపీలో చేరి సీటు తెచ్చుకున్న కేశినేని నాని.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని ఘాటు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనను ఓడించాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉందని చెబుతున్నారు.

ఇక అన్నిటికంటే ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ దృష్టి సారించిందని అంటున్నారు. 2004, 2009ల్లో టీడీపీ తరఫున గెలుపొందిన కొడాలి నాని ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014, 2019ల్లో వైసీపీ నుంచి గెలుపొందారు. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర దూషణలు చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా కొడాలి నాని పాపులర్‌ అయ్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్‌ పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. కొడాలి నానికి దీటుగా ఇక్కడ వెనిగండ్ల రాము అనే అభ్యర్థిని నిలిపారు. రాము ఎన్నారై కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో చాలాకాలం నుంచి గుడివాడ నియోజకవర్గమంతటా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నానిని ఐదోసారి గెలవనీయకుండా ఇంటికి పంపాలని టీడీపీ కృతనిశ్చయంతో ఉందని చెబుతున్నారు.

అలాగే పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న మంత్రి జోగి రమేశ్‌ ను కూడా టీడీపీ లక్ష్యంగా చేసుకుందని టాక్‌ నడుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపైకి భారీ ఎత్తున కార్ల కాన్వాయ్‌ తో జోగి రమేశ్‌ దాడికి వెళ్లారని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై తీవ్ర దూషణలు చేసేవారిలో జోగి రమేశ్‌ ఒకరని అంటున్నారు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజికవర్గం అత్యధికంగా ఉన్న పెనమలూరులో జోగి రమేశ్‌ ను చిత్తుగా ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుందని అంటున్నారు.

Tags:    

Similar News