విజయవాడ సెంట్రల్‌లో టీడీపీకి బెంగ.. రీజనేంటి?
ఇదే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగాను.. బెంగగానూ మారింది. గత ఎన్నికల్లో 29 వేల ఓట్లు చీల్చిన బాబూరావు ఎఫెక్ట్ ఇప్పుడు అంతకు మించి చీల్చినా ఆశ్చర్యం లేదని నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నది టీడీపీ-జనసేన సంకల్పం. అందుకే.. బీజేపీని కూడా తోడు తెచ్చుకుని చేతులు కలిపి ఉమ్మడిగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటికి దిగుతున్నాయి. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కమ్యూనిస్టు లు.. కూటమి పార్టీలకు ఎసరు పెడుతున్నాయి. ఆది నుంచి టీడీపీతో జతకట్టాలని రెండు కమ్యూనిస్టు పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. కానీ, సాధ్యం కాలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌తో జతకట్టి ముందుకు వస్తున్నాయి.
ఈ క్రమంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీపీఎం+కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ నాయకుడు, మాజీ కార్పొరేటర్.. చిగురుపాటి బాబూరావుకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే.. ఈయన రాజకీయాలకు కొత్తకాదు. పైగా సెంట్రల్ నియోజకవర్గం ఆయనకు కొట్టిన పిండి. గత 2019లోనూ ఆయన పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఏకంగా బాబూరావు.. 29 వేల పైచిలుకు ఓట్లు దక్కించుకున్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆయనే బరిలో నిలవడం ఖాయమైంది.
ఇదే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందిగాను.. బెంగగానూ మారింది. గత ఎన్నికల్లో 29 వేల ఓట్లు చీల్చిన బాబూరావు ఎఫెక్ట్ ఇప్పుడు అంతకు మించి చీల్చినా ఆశ్చర్యం లేదని నియోజకవర్గంలో పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బొండా ఉమా మహేశ్వరరావు పోటీ చేశారు. అయితే.. ఆయన ఆ ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇప్పుడైనా.. తాను గెలుస్తానని బొండా చాలానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, సీపీఎం నుంచిబలమైన నాయకుడు రంగంలోకిదిగడంతో ఈ ఆశలపై నీళ్లు జల్లుతున్నట్టు అయింది.
ఇక, వైసీపీ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. నియోజకవర్గానికి ఈయన కొత్తే అయినా.. వాస్తవానికి.. వైసీపీ పథకాలు.. ఇతరత్రా అంశాలతోపాటు జగన్ ఇమేజ్‌తోకొట్టేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలా చూసుకున్నా.. వైసీపీ వర్సెస్‌టీడీపీ మధ్య పోరు ఉత్కంఠగా మారింది. ఇలాంటి సమయంలో ఓట్లు చీల్చితే.. అది అంతిమంగా టీడీపీపైనే ప్రభావం చూపుతుందనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికైతే.. టీడీపీ నేతల్లో బెంగ కనిపిస్తోంది.