హాట్ టాపిక్: యూకే - యూఎస్ మధ్య 'టీ' రచ్చ
ఈ వివాదం అంతకంతకూ పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించిన లండన్ లోని అమెరికా రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది.
అగ్రరాజ్యాలుగా పేరున్న యూఎస్.. యూకేల మధ్య సిత్రమైన రచ్చ మొదలైంది. ఈ రెండు ధనిక దేశాలు చాలా విషయాల్లో ఇచ్చి పుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటాయి. అలాంటిది అనూహ్యంగా ఒక అమెరికన్ ప్రొఫెసర్ చేసిన పనికి రెండు దేశాల మధ్య రచ్చ మొదలు కావటమే కాదు.. ఆయా దేశాల ప్రతినిధులు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇరు దేశాల మధ్య మొదలైన టీ రచ్చపై భారీ చర్చ జరుగుతోంది. ఇంతకూ అసలు వివాదంలోకి వెళితే.. ఇంత సింఫుల్ ఇష్యూ.. ఇంత రచ్చగా మారిందా? అన్న విస్మయానికి గురి కాక తప్పదు.
సాధారణంగా రెండు దేశాల మధ్య వివాదం అంటే సరిహద్దుల సమస్యో.. ఇంకేమైనా ఆర్థికపరమైన అంశమో.. రాజకీయ అంశాలో అనుకుంటాం. కానీ.. డిజిటల్ ప్రపంచంలో అందుకు భిన్నంగా చిన్న అంశాలు సైతం పెద్ద రచ్చకు తెర తీస్తుంటాయి. అమెరికాకు చెందిన ఒక ఫ్రొఫెసర్ టీ అన్నది ఎలా చేయాలో చెబుతూ ఒక పుస్తకం రాశారు. అందులో ఆమె చేసిన సూచనపై యూకే వాసులు అగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. అలా ఎలా చెబుతారు? అన్నది వారి ప్రశ్న.
అమెరికా ప్రొఫెసర్ టీ గురించి చెబితే.. యూకే వాసులకు ఎందుకంత అభ్యంతరం అంటే.. టీ అన్నది బ్రిటన్ పౌరుల జాతీయ పానీయమన్న విషయాన్ని మర్చిపోకూడదు. అమెరికాలోని పెన్సిల్వేనియోకు చెందిన మిషెల్ ఫ్రాంక్ అనే మహిళ కెమిస్ట్రీ ఫ్రొఫెసర్ గా పని చేస్తుంటారు. టీ అంటే ఆమెకు మహా ఇష్టం.
దీంతో.. దీనిపై పలు గ్రంధాలు.. పురాతన గ్రంధాలను తిరగేసిన ఆమె.. టీ సరిగా కుదరాలంటే.. చిటికెడు ఉప్పు వేస్తే అద్భుతమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆమె స్టీప్డ్.. ది కెమిస్ట్రీ ఆఫ్ టీ అనే పుస్తకంలో రాశారు. అయితే.. ఆమె చేసిన సూచన యూకే వాసులకు అస్సలు నచ్్చలేదు. దీంతో పెద్ద వివాదం రేగింది. ఈ సూచనపైనా.. ఆమెపైనా ఆన్ లైన్ లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ వివాదం అంతకంతకూ పెరిగిపోతున్న విషయాన్ని గుర్తించిన లండన్ లోని అమెరికా రాయబార కార్యాలయం రంగంలోకి దిగింది. టీ అన్నది రెండు దేశాలను కలిపే అద్భుత పానీయంగా పేర్కొన్న వారు.. కప్పు టీలో ఉప్పును కలపటం మా అధికారిక విధానం కాదంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు.. భవిష్యత్తులో కూడా ఉండదని తేల్చారు. ఇక్కడితో ఇష్యూ క్లోజ్ అయ్యిందనుకున్న వేళ.. మరో పాయింట్ తెర మీదకు వచ్చింది.
అమెరికా రాయబారులు తమ వివరణలో సరైన టీ ను మైక్రోవేవ్ ఓవెన్ లోనే తయారు చేస్తామని పేర్కొనటంపై బ్రిటన్ ప్రభుత్వమే రంగంలోకి దిగింది. టీను కెటిల్ లో మాత్రమే చేయాలని క్యాబినెట్ ఆఫీస్ సైతం సోషల్ మీడియాలో పోస్టు చేయటం గమనారర్హం. ఒక టీ రెండు అగ్ర దేశాల మధ్య వివాదానికి కారణమైందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.