16 ఏళ్లలో తొలిసారి...టెక్ మహీంద్రాలో ఏమి జరుగుతుంది?
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక ఏడాది జులై- సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది
ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక ఏడాది జులై- సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా... ఏకీకృత ప్రాతిపదికన ఆ కంపెనీ రూ.505.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో వచ్చిన లాభం మాత్రం గతేడాదితో పోలిస్తే చాలా తక్కువ కావడం గమనార్హం. దీంతో... ఇందుకు గల కారణాలను వివరించే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో సిబ్బంది సంఖ్యపై కూడా కీలక విషయాలు వెల్లడించింది.
అవును... ఐటీ కంపెనీ టెక్ మహీంద్రా, జులై- సెప్టెంబరు త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన ఆర్జించిన నికర లాభం రూ.505.30 కోట్లు.. 2022-23 ఇదే త్రైమాసికంలో రూ.1,299.20 కోట్లు. అంటే... గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి లాభాల్లో క్షీణత సుమారు 61 శాతం అన్నమాట! అయితే ఇందుకు గల కారణాలను కంపెనీ వివరించింది. ఇందులో భాగంగా... ఖాతాదారులు ఖర్చులు తగ్గించుకునేందుకు ట్రై చేస్తుండటం, కొత్త ప్రాజెక్టులు ఆలస్యం కావడం ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది.
ఇదే సమయంలో... కమ్యూనికేషన్లు, మీడియా, ఎంటర్టైన్ మెంట్ విభాగాల్లో కూడా కంపెనీ ఆదాయాలు 11.5 శాతం తగ్గాయి. అదేవిధంగా... బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్ వ్యాపారంలో 6.3%.. రవాణా, రిటైల్, లాజిస్టిక్స్ విభాగంలో 4.6 శాతం చొప్పున ఆదాయాల్లో క్షీణత నమోదైందని టెక్ మహీంద్రా వెల్లడించింది. ఇక ప్రాంతాలవారిగా చూస్తే... అత్యధికంగా ఐరోపా విపణిలో వ్యాపారం 8.6 శాతం క్షీణించిందని తెలిపింది.
ఇదే క్రమంలో... అమెరికా కార్యకలాపాల్లో 0.5 శాతం, ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో 11 శాతం మేర వ్యాపారాలు తగ్గాయని టెక్ మహీంద్రా పేర్కొంది. అయితే ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో రూ.2,980 కోట్లుగా ఉన్న దక్కించుకున్న ఆర్డర్ల విలువ ఈ త్రైమాసికంలో 78 శాతం పెరిగి రూ.5,300 కోట్లకు చేరడం గమనార్హం. అయినప్పటికీ.... 2022-23 సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం దీని విలువ కూడా 10 శాతం తక్కువే!
ఇక సిబ్బందికి సంబంధించిన కీలక విషయాలను టెక్ మహేంద్ర వెల్లడించింది. ఇందులో భాగంగా... ఏడాది క్రితం ఇదే సమయంలో 1,63,912 మందితో స్టాఫ్ ఉంటే.. ఈ సెప్టెంబరు చివరి నాటికి వారి సంఖ్య 1,50,604 కు పరిమితమైంది. అంటే... 8.1 శాతం తక్కువ అన్నమాట. ఇదే సమయంలో సిబ్బంది వలసల రేటు కూడా 20 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది.
దీంతో... నిర్వహణ సామర్థ్యాలను అప్ డేట్ చేసుకోవడం, మరింత మెరుగుపరుచుకునే ఉద్దేశంలో భాగంగా కొన్ని వ్యాపారాల నుంచి వైదొలిగేందుకు ఉన్న మార్గాలను టెక్ మహీంద్రా పరిశీలిస్తోందని తెలుస్తుంది. ఈ సందర్భంగా తాజా పరిస్థితులపై టెక్ మహీంద్రా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సి.పి గుర్నానీ స్పందించారు. అంచనాలకు మించి ఖాతాదారులు వ్యయాలు తగ్గిస్తుండటమే దీనికి కారణం అని అభిప్రాయపడ్డారు.