మరో పదేళ్లలో ఈ ఉద్యోగాలు కనుమరుగు!

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా మాధ్యమం.. లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్‌ మన్‌ మరో బాంబుపేల్చారు.

Update: 2024-07-26 17:30 GMT

ఇప్పుడు టెక్నాలజీ యుగం నడుస్తోంది. రోజురోజుకీ సాంకేతికతల్లో వస్తున్న మార్పులతో ఆయా రంగాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), రోబోటిక్స్‌ వంటివాటి ప్రవేశంతో ఆయా రంగాల్లో మానవ వనరుల అవసరం ఉండదనే అంచనాలు ఉన్నాయి. ఉద్యోగులు చేసే పనిని ఏఐ, రోబోలు చేస్తాయని దీంతో కంపెనీలకు మానవ వనరుల అవసరం భారీగా తగ్గిపోతుందని నిపుణులు ఇప్పటికే బాంబుపేల్చారు.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ సోషల్‌ మీడియా మాధ్యమం.. లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్‌ హాఫ్‌ మన్‌ మరో బాంబుపేల్చారు. వచ్చే పదేళ్లలో కొన్ని ఉద్యోగాలు ఉండవని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ తరహా ఉద్యోగాలు ఉంటాయో చెప్పారు. తద్వారా ఉద్యోగ ప్రపంచంలో పెద్ద చర్చనే లేపారు.

2034 నాటికి ఇప్పుడున్న సంప్రదాయ ఉద్యోగాలు (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు) కనుమరుగవుతాయని హాఫ్‌ మన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అయితే దీనివల్ల కొత్త అవకాశాలతో పాటు, సవాళ్లూ ఉంటాయని తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగు కావడంతో స్థిరమైన ఉద్యోగాలు ఉండవని హాఫ్‌ మన్‌ తెలిపారు. మరోవైపు ఆయా రంగాల్లో నిపుణులు ఒకేచోట దీర్ఘకాలం పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతాయని వెల్లడించారు.

ఒక వ్యక్తి ఒక కంపెనీకే పరిమితం కాకుండా వివిధ కంపెనీలతోపాటు వివిధ రంగాల్లో తన ప్రతిభ, నైపుణ్యాలకు అనుగుణంగా పనిచేసే అవకాశం దక్కుతుందని హాఫ్‌ మన్‌ అంచనా వేశారు. దీంతో ఆయా కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని వివరించారు. రాబోయే రోజుల్లో ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)తో సహా అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో లింక్డిన్‌ సహ వ్యవస్థాపకుడు హాఫ్‌ మన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాంకేతిక రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో వేసిన పలు అంచనాలు నిజం కావడం విశేషం.

సోషల్‌ మీడియా మాధ్యమాలకు విపరీతమైన ఆదరణ దక్కుతుందని గతంలోనే హాఫ్‌ మన్‌ అంచనా వేశారు. అలాగే గిగ్‌ ఎకానమీ ఊపందుకుంటుందని ఎన్నో ఏళ్ల క్రితమే వెల్లడించారు. ఇక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి అయితే 1997లోనే హాఫ్‌ మన్‌ చెప్పడం విశేషం. ప్రపంచంలో ఏఐ విప్లవం సృష్టిస్తుందని అప్పట్లోనే ఆయన అంచనాలు వెలువరించారు.

ఈ క్రమంలో ఇప్పుడు మరో పదేళ్లలో.. అంటే 2034 నాటికి సంప్రదాయ ఉద్యోగాలు కనుమరుగవుతాయని హాఫ్‌ మన్‌ తాజాగా చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు ఒకే దగ్గర, ఒకే పనిని చేయబోరని ఆయన అంటున్నారు. ఒకే సమయంలో వివిధ కంపెనీలకు రకరకాల పనులు (మూన్‌ లైటింగ్‌) చేసే రోజులు వస్తాయని వెల్లడించారు.

ఇప్పటికే కోవిడ్‌ తర్వాత కంపెనీలకు వెళ్లి పనిచేసే విధానం తగ్గిపోయింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం పెరిగిపోయింది. వర్చువల్‌ డిస్కషన్స్, మీటింగ్స్‌ ఇలా అన్నీ ఆన్‌ లైన్‌ లోనే జరిగిపోతున్నాయి. ఇక రానున్న పదేళ్లకు అంటే ఎన్నో మార్పులు ఖాయం. ఇదే విషయాన్ని తాజాగా హాఫ్‌ మన్‌ కూడా చెబుతున్నారు.

Tags:    

Similar News