"రాముడు అయోధ్య‌కు రాన‌న్నాడు.."

ఇప్పుడు తాజాగా బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు, ఎమ్మెల్యే తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Update: 2024-01-15 09:53 GMT

ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అయోధ్య‌లో మ‌రో వారం రోజుల్లో జ‌ర‌గ‌నున్న బాల రాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంగ‌రంగ వైభ‌వంగా ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎక్క‌డెక్క‌డి నుంచో అతిథుల‌ను కూడా ఆహ్వానించారు. ఇక‌, దేశంలో ఇప్ప‌టికే అన్ని రాష్ట్రాల్లో అక్షింత‌లు, రాములోరి ప‌టాల‌ను కూడా పంచుతున్నారు. యూపిని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు అయోధ్య రాముడి ఆల‌యాన్ని ప్రారంభిస్తుండ‌డం ఆస‌క్తిగా మారింది.

అయితే.. మ‌రోవైపు ఈ కార్య‌క్ర‌మంపై అంతే తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే నాలుగు పీఠాల స్వాములు అయోధ్య‌కు రాబోమ‌నితేల్చి చెప్పారు. సగం నిర్మాణ‌మే పూర్తి చేసుకున్న ఆల‌యంలో ప్రాణ‌ప్ర‌తిష్ట చేయ‌డం శాస్త్ర విరుద్ధ‌మని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. రాజ‌కీయంగా కూడా.. ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా, రాహుల్‌, మ‌ల్లికార్జున ఖ‌ర్గేలు ఈ ఆల‌యప్రారంభోత్స‌వానికి రాబోమ‌ని తేల్చి చెప్పారు.

ఇక‌, ఇప్పుడు తాజాగా బిహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు, ఎమ్మెల్యే తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీరాముడు తన కలలోకి వచ్చాడ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఆయ‌న అయోధ్య‌కు రావ‌డం లేద‌ని చెప్పిన‌ట్టు తెలిపారు. "ఎన్నికలు ముగిసిన తర్వాత రాముడ్ని మర్చిపోతారు. జనవరి 22వ తేదీనే రాముడు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే రాముడు నలుగురు శంకరాచార్యుల కలల్లోకి వచ్చారు. నా కలలోకి రాముడు వచ్చారు" అని తేజ్ వ్యాఖ్యానించారు.

అయోధ్య‌లో బాల రాముడి విగ్ర‌హ‌ ప్రతిష్టాపన కార్యక్రమానికి రానని రాముడు త‌న‌కు చెప్పిన‌ట్టు తెలిపారు. "ఇది ఒక 'వంచన' కార్యక్రమమని రాముడు నాతో చెప్పారు" అని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ నెల 22వ తేదీన రామ్‌లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న చేస్తు్న్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News