బీహార్ జార్ఖండ్ తరువాత తెలంగాణా యేనా...!?
నేపధ్యంలో అందరి చూపూ తెలంగాణా మీద పడింది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద తన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.
ఇటీవల కాలంలో దేశంలో చూస్తే ఒక ప్రభుత్వం మారిపోయింది. మరో ప్రభుత్వం సీఎం రాజీనామా చేసి మాజీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా దినదినగండంగానే ఉండబోతోంది. ఎన్నికలు ముంచుకుని వస్తున్న వేళ సంభవించిన పరిణామాలు ఇవి.
ముందుగా చూస్తే బీహార్ లో ఉదయం ఉన్న ప్రభుత్వం సాయంత్రానికి మారి కొత్తది ఏర్పడింది. దీన్ని పొలిటికల్ మ్యాజిక్ అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటూ ఆశ్చరం వ్యక్తం చేశారు. ఇంత జెట్ స్పీడ్ తో ఒక కూటమి నుంచి తప్పుకుని మరో కూటమితో జట్టు కట్టి తన సీఎం పదవిని కాపాడుకున్నది నితీష్ కుమార్ అయితే తెర వెనక కేంద్రంలో పాలిస్తున్న అధికార బీజేపీ ఉందని విపక్షాలు గొంతు చించుకుంటున్నాయి.
బీహర్ ఉదంతం అలా ఉండగాజే జార్ఖండ్ లో అలజడి రేగింది. బలంగా ఉన్న హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో సంక్షోభం చెలరేగింది. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ రెడీ అయిన వేళ గత్యంతరం లేక రాజీనామా చేశారు. అయితే తన సతీమణికి ఆ పదవిని కట్టబెట్టి తమ చెప్పుచేతలలో ప్రభుత్వం ఉంచుకోవాలంటే హేమంత్ సోరెన్ వదిన అడ్డు చెప్పారు. మొత్తానికి సీనియర్ నేత చంపై సోరెన్ కి సీఎం పదవి కట్టబెట్టారు.
ఆయన ప్రమాణం చేయడానికి ముందు కూడా హై డ్రామా నడచింది. వెంటనే ఆయనకు గవర్నర్ నుంచి పిలుపు రాలేదు. దాంతో జార్ఖండ్ ముక్తీ మోర్చా ఎమ్మెల్యేలు హైదరాబాద్ క్యాంప్ పెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే హేమంత్ సోరెన్ వదినకు సీఎం పదవి కాంక్ష ఉందని ఈ ఎపిసోడ్ లో బయటపడింది. దాంతో ఈ రోజు కాకపోయినా తొందరలో బీజేపీ అక్కడ పావులు కదిపితే చంపై సోరేన్ సర్కార్ కూలడం ఖాయమని అంటున్నారు.
ఈ రెండు సంఘటనలు దేశంలో మిగిలిన పార్టీలలో అలజడి పుట్టించాయి. మరీ ముఖ్యంగా అరకొర మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పార్టీలకు అవి అలెర్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అందరి చూపూ తెలంగాణా మీద పడింది. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద తన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.
ఎన్నాళ్ళు ఉంటుందో ప్రభుత్వం అన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ దానికి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్లు కూడా చర్చకు వస్తున్నాయి. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలా మాట్లాడే బీఆర్ఎస్ నేతలను గ్రామాల్లోకి రానీయవద్దు అని కూడా రేవంత్ రెడ్డి పిలుపు ఇస్తున్నారు.
మరో వైపు చూస్తే కేసీఆర్ రాజకీయ చాణక్యుడు ఆయన ఎన్నికలు జరిగిన రెండు నెలల తరువాత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. నిజానికి అయితే ఆయన అసెంబ్లీకి రారని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ దానికి భిన్నంగా కేసీఆర్ తాను ఎమ్మెల్యేగానే ఉంటా అంటూ ప్రమాణం చేశారు.
మరి అయిదేళ్ళ పాటు ఆయన ఎమ్మెల్యేగా ఉంటారా అంటే అక్కడే డౌట్లు కొడుతున్నాయని అంటున్నారు. ఏదో అంచనా మరేదో వ్యూహాలు బీఆర్ఎస్ పెద్దలలో ఉన్నాయని అంటున్నారు. ఇక బీజేపీ వ్యవహార శైలి చూసిన వారు ప్రభుత్వాలను కూలగొట్టడంలో స్పెషలిస్ట్ అనే అంటారు.
ముఖ్యంగా బొటాబొటీ మెజారిటీతో తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 60 అయితే 64 మంది మాత్రమే కాంగ్రెస్ కి ఉన్నారు. సీపీఐ మద్దతు కలుపుకుని అయిదు మంది ఉన్నారు ఇది సింపుల్ మెజారిటీ కింద లెక్క. విపక్షం చూస్తే 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి ఉన్నారు. బీజేపీకి ఎనిమిది మంది ఉన్నారు. మజ్లీస్ కి ఏడుగురు ఉన్నారు. అంటే యాభై నాలుగు మంది అన్న మాట. మరో ఆరుగురు కలిస్తే ప్రభుత్వం కూలుతుంది.
అయితే అది ఇప్పట్లో జరగదని లోక్ సభ ఎన్నికల తరువాత మళ్లీ మోడీ సర్కార్ గెలిస్తే మాత్రం ఆపరేషన్ తెలంగాణా ఉండొచ్చు అని అంటున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను లాగే పనిలో బీఆర్ఎస్ బీజేపీ అపుడు ఫుల్ బిజీ అవుతాయని కూడా అనుమానిస్తున్నారు. చూడాలి మరి తెలంగాణాలో ఏమి జరుగుతుందో.