మరో వివాదంలో ఆ ఎమ్మెల్యే.. అసెంబ్లీలో చెప్పు విసిరారంటున్న బీఆర్ఎస్
అది కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
అధికార-ప్రతిపక్షాల వాద సంవాదాలతో తెలంగాణలో అసెంబ్లీ ద్దదరిల్లుతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ కు ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుగానే ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా -ఈ రేస్ వ్యవహారంలో కేసు నమోదుతో రాజకీయం ముదురు పాకాన పడింది. అది కూడా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.
చర్చకు పట్టు.. రచ్చకు దారి
ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు నమోదును నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టడం చివరకు రచ్చకు దారితీసింది. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్ జోక్యంతో చేసుకుని.. భూ భారతి బిల్లుపై ప్రభుత్వం చర్చకు సిద్ధమైన నేపథ్యంలో తరువాత నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ కు సూచించారు. కానీ, ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, మార్షల్స్ అడ్డుకోవడంతో గందరగోళం ఏర్పడింది.
వీర్లపల్లి శంకర్ మరోసారి..
ఇటీవల ఓ సామాజిక వర్గంపై విమర్శలు చేసి వివాదంలో చిక్కుకున్న షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అయ్యారు. వీర్లపల్లి శంకర్ తమకు సభలోనే చెప్పులు చూపించాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాగితాలు, వాటర్ బాటిల్స్ విసిరివేయడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, తొలుత మంత్రి పొంగులేటిపై వాటర్ బాటిల్స్ విసిరారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ 15 నిమిషాలు వాయిదా వేశారు.
ఇక తొలినుంచి దూకుడుగా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత స్పీకర్ ను అమానించేలా వ్యవహరించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.