సవాళ్ల సభ.. తెలంగాణ అసెంబ్లీలో ఆధిపత్య పోరు!
తమదే పైచేయి కావాలని అనుకోవడం.. ఈ క్రమంలో అనవసరమైన అంశాలపై చర్చకు పట్టడం.. బీఆర్ ఎస్ చేస్తున్న వ్యూహం.
తెలంగాణ అసెంబ్లీ ఆధిపత్య పోరుకు వేదికగా మారిపోయింది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ ఎస్‌లు.. ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శల నుంచి సవాళ్ల వరకు సభా కార్యక్రమాలను వేడెక్కిస్తున్నారని అనుకోవాలో.. సభా సమయాన్ని వృధా చేస్తూ.. ప్రజల సమస్యలపై చర్చలను పక్కదారి పట్టిస్తున్నారని అనుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తమదే పైచేయి కావాలని అనుకోవడం.. ఈ క్రమంలో అనవసరమైన అంశాలపై చర్చకు పట్టడం.. బీఆర్ ఎస్ చేస్తున్న వ్యూహం.
ఇక, బీఆర్ ఎస్‌కు చెక్ పెట్టేక్రమంలో అధికార పార్టీ సభ్యులు కూడా.. హద్దులు మరిచిపోతున్నారు. దీంతో సభా సమయం సవాళ్ల పర్వంగా.. ఆధిపత్య పోరుకు వేదిగా మారిపోయింది. గత రెండు రోజులుగా జరుగుతు న్న సభా కార్యక్రమాలు.. ఈ దిశగానే సాగుతున్నాయి. తాజాగా మరోసారి సవాళ్లతో సభ అట్టుడికి పోయింది. ‘రైతు భరోసా’ అంశంపై జరిగిన చర్చలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ఆసాంతం సవాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణ మాఫీపై ఆయన విమర్శలు గుప్పించారు.
ఇదేసమయంలో ఏ ఒక్క గ్రామంలో అయినా సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజకీయాలను వదిలేసుకుంటానని సవాల్ చేశారు. అంతేకాదు.. రైతులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారని.. అలా ఒక్క గ్రామంలో అయినా.. ఇస్తున్నట్టు నిరూపిస్తే.. తమ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అందరూ.. కలిసి సంయుక్తంగా రాజీనామాలు చేస్తామని ఆయన మరో సవాల్ రువ్వారు. ఇక, సర్కారు తీరును ఆయన ఎండగట్టారు.
అయితే.. ఇదేసమయంలో అధికార పక్షం నుంచి కూడా.. ఎదురు దాడి జరిగింది. ఎక్కడ ఏ గ్రామంలో ఇవ్వలేదో చెప్పాలంటూ.. మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. తాము కూడా సిద్ధమేనని చెప్పారు. దీంతో సభలో అరుపులు , కేకలు చోటు చేసుకున్నాయి. అత్యంత విలువైన సమయాన్ని ఇలా సవాళ్లు ప్రతిసవాళ్లు.. ఆధిపత్య పోరుకే పరిమితం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు అయితే.. వస్తుండడం గమనార్హం.