కాషాయంలో అంతర్మథనం... నేతల అసమ్మతి రాగం.. మొన్న కాటేపల్లి.. నిన్న ధర్మపురి..

తెలంగాణ బీజేపీలో అసమ్మతిరాగం కనిపిస్తోందా..? నేతల మధ్య సయోధ్య కుదరడం లేదా..?

Update: 2024-10-18 13:30 GMT

తెలంగాణ బీజేపీలో అసమ్మతిరాగం కనిపిస్తోందా..? నేతల మధ్య సయోధ్య కుదరడం లేదా..? అందుకే ఒక్కో నేత పార్టీ మీద, రాష్ట్ర నాయకత్వం మీద విమర్శలు చేస్తున్నారా..? వారి విమర్శల్లో ఉన్న నిజం ఎంత..? వారి మాటలపై పార్టీలోనూ అంతర్మథనం మొదలైందా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైంది. ఇటీవల వరుసకట్టి నేతలు నాయకత్వంపై, గత అసెంబ్లీ ఎన్నికలపై విమర్శలు చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. ఒక్కసారిగా ఇలా స్వరం వినిపించడంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనలో పడింది. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు పెను దురమారం రేపాయి.

ఇటీవల సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన గత అసెంబ్లీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర నాయకత్వాన్ని నిందించారు. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో వీరిద్దరి వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో పెనుదుమారం రేపాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించిన పార్టీకి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థానాలు రాకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలో వస్తుందనుకున్న పార్టీ కేవలం 8 సీట్లకు ఎందుకు పరిమితం కావల్సి వచ్చిందని అడిగారు. దీనికి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు.. బాధ్యులెవరో తేల్చాలంటూ డిమాండ్ చేశారు.

దీంతో ఆ వ్యా్ఖ్యలపై రాష్ట్ర నాయకత్వం ఆలోచనలో పడింది. వీరి వెనుకాల ఎవరైనా ఉండి ఈ వ్యాఖ్యలు చేయించారా..? లేదంటే సొంతంగా చేశారా..? అనే సందిగ్ధంలో ఉండిపోయింది. అటు వీరి వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యమేంటరి పార్టీలోనూ చెవులు కొరుక్కుంటున్నారు. అర్వింద్ ఎవరిని టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులోభాగంగా రాష్ట్రంలో 50 లక్షల సభ్యత్వాల టార్గెట్ విధించింది. అయితే.. మరో వారం రోజుల్లో ఆ గడువు ముగియనుంది. కానీ.. లక్ష్యం మాత్రం కేవలం 20 లక్షల దగ్గరే ఆగిపోయింది. దాంతో లక్ష్యం పూర్తికాక తల పట్టుకుంటున్న రాష్ట్ర అధినాయకత్వానికి ఇప్పుడు ఈ ఇద్దరి నేతల వైఖరి మరింత తలపోటుగా మారింది.

పార్టీ గెలుపు ఓటములు ఏమైనా ఉంటే అది అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశం. కానీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రజలు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు వేయలేదని కామెంట్స్ చేయడంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. వాస్తవానికి గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకుంది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానానికే పరిమితం అయింది.

మరోవైపు.. ధర్మపురి అర్వింద్ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసమే సంచలన వ్యాఖ్యలు చేశారని టాక్ నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని పక్కకు జరిపినప్పుడే ఆయన అధ్యక్ష పదవిని ఆశించారు. కానీ.. అధిష్టానం మాత్రం కిషన్ రెడ్డికే పగ్గాలు అప్పజెప్పింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని మార్చే అవకాశాలు ఉండడంతో ఏదో ఒక వ్యాఖ్యలు చేసి సెన్సేషనల్ అయ్యేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News