అధ్యక్ష్యా .. అనాలంటే ఆ మాత్రం చేయాల్సిందే !

అయితే ప్రధానంగా ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు రాష్ట్ర అధ్యక్ష్య పదవిని ఆశిస్తున్నారు.

Update: 2024-09-13 14:30 GMT

తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తరువాత కేంద్రంలో మంత్రి పదవి దక్కక పోవడంతో మాజీ మంత్రి, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ తనకు పార్టీ అధ్యక్ష్య పదవి ఖాయం అని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ అధిష్టానం ఆ విషయం ఎటూ తేల్చడం లేదు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవితో పాటు, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంఛార్జ్ గా కూడా నియమించారు. ఆయన ఇక్కడ పార్టీకి సమయం ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ నేతల మధ్య, పార్టీ కార్యక్రమాల మధ్య సమన్వయం లోపించిందన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ పరిస్థితులలోనే ఈ నెల 9 నుండి రాష్ట్రంలో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యే, ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటు 70 లక్షల ఓట్లు వచ్చిన నేపథ్యంలో 70 లక్షల సభ్యత్వ నమోదు చేయించాలని, అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నేతలకు ఇదే పరీక్ష అని పార్టీ అధిష్టానం చెప్పినట్లు సమాచారం.

అంటే రాష్ట్రంలో ప్రతి బూతుకు 200 మంది కార్యకర్తల సభ్యత్వ నమోదు చేయించాలి. ఇంత మొత్తం సాధ్యమేనా అని పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు. రెండు సార్లు రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మరి బీజేపీకి 70 లక్షల సభ్యత్వ నమోదు ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ప్రధానంగా ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావులు రాష్ట్ర అధ్యక్ష్య పదవిని ఆశిస్తున్నారు. అందుకే సభ్యత్వ నమోదును విజయవంతం చేసి అధిష్టానాన్ని మెప్పించే ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. మరి సభ్యత్వ నమోదు ఎలా ఉంటుంది ? అధ్యక్షుడు ఎవరు అవుతారు ? అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News