ఆ ఇద్దరి వల్లే టీ.కేబినెట్ విస్తరణకు బ్రేక్!

ఈ నెల తొలివారంలో జరుగుతుందని అనుకున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది.;

Update: 2025-04-08 02:45 GMT
ఆ ఇద్దరి వల్లే టీ.కేబినెట్ విస్తరణకు బ్రేక్!

ఈ నెల తొలివారంలో జరుగుతుందని అనుకున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడింది. తొలివారం గడిచినా మంత్రివర్గం విస్తరణ ముహూర్తం మాత్రం ఖరారు కాలేదు. ఇప్పట్లో మంత్రివర్గాన్ని విస్తరించే సూచనలు కనిపించడం లేదంటున్నారు. ప్రభుత్వం కొలువుదీరిన 15 నెలలకు మంత్రి పదవులు భర్తీ చేస్తారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందన్నారు. కొందరి పేర్లు ఖరారయ్యాయంటూ చెప్పారు. అయితే అలా జరిగిన ప్రచారమే విస్తరణకు బ్రేక్ వేసిందని తాజాగా చెబుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వల్లే విస్తరణ ప్రక్రియ నిలిచిపోయిందని టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు కావస్తోంది. మంత్రివర్గంలో మొత్తం 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. ఇంకా ఆరుగురికి మంత్రిగా చాన్స్ ఇవ్వొచ్చు. అయితే రకరకాల కారణాలతో ఈ ఆరు ఖాళీలను తొలుత పెండింగులో పెట్టారు. రేవంత్ ప్రమాణం చేసిన నెల రోజుల్లోనూ ఈ ఆరు ఖాళీలు భర్తీ చేస్తారని అప్పట్లో చెప్పారు. అయితే వివిధ కారణాలతో నెల రోజులు కాస్త అనేక వాయిదాలు పడుతూ 15 నెలలు గడిచింది. ఇప్పుడు కూడా అప్పడు, ఇప్పుడు అంటున్నారే కానీ, ఎప్పుడో చెప్పడం లేదు. దీంతో మంత్రి పదవులను ఆశిస్తున్నవారు ఉసూరు మంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటం, మంత్రివర్గంలో పలు జిల్లాలు, కులాలు, మతాల వారికి ప్రాతనిధ్యం లేకపోవడంతో ఎట్టిపరిస్థితుల్లో ఈ నెలలో విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. గత నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఇతర సీనియర్లను ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. ఈ క్రమంలో ఏప్రిల్ 2న మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం జరిగింది. ఆ ముహూర్తం మీరిపోయింది కానీ, మంత్రివర్గ విస్తరణ మాత్రం ఊసులేకపోయింది. దీనికి ప్రధాన కారణం కాబోయే మంత్రులు అంటూ కొందరి పేర్లు ప్రచారంలోకి రావడం, వారి పేర్లపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడమేనంటున్నారు.

మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా, ఈ సారికి నాలుగు భర్తీ చేయాలని భావించారని అంటున్నారు. ఇందులో రెండు పదవులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు ఇస్తున్నారంటూ ప్రచారం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆ ఇద్దరికి ఇతర శాసనసభ్యులు అభినందనలు చెప్పడంతో వారికి మంత్రి బెర్తులు ఖరారయ్యారని అంతా అనుకున్నారు. అయితే వీరి పేర్లపై పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతోనే విస్తరణకు ఫుల్ స్టాప్ పడిందని అంటున్నారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఇప్పటికే మంత్రిగా ఉండటం, గడ్డం వివేక్ ఇంట్లో మూడు పదవులు ఉండటంతో అన్ని అవకాశాలు వారికే ఇస్తారా? అనే ప్రశ్న తలెత్తిందంటున్నారు. ఎన్నికలకు ముందు మంత్రి పదవిని ఇస్తామనే హామీతోనే ఆ ఇద్దరిని పార్టీలో చేర్చుకున్నప్పటికీ, ఇప్పుడు కేడర్ అడ్డం తిరగడంతో అధిష్టానం అడకత్తెరలో పడిపోతోందంటున్నారు. అంతేకాకుండా వీరికి పదవులిస్తే సామాజికంగానూ విమర్శలు తలెత్తే అవకాశం ఉందనే భయం పార్టీలో కనిపిస్తోందని చెబుతున్నారు.

ప్రస్తుతం మంత్రివర్గంలో రెడ్డి సామాజికవర్గం వారు అధికంగానే ఉన్నారు. అంతేకాకుండా కొత్తగా మంత్రి అవకాశం ఇవ్వాల్సినవారిలోనూ కొందరు రెడ్డి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సారికి రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టాలని అధిష్టానానికి సూచనలు వస్తున్నాయంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఎక్కువ. కానీ, మంత్రివర్గంలో మాల సామాజికవర్గం నేతలకే ప్రస్తుతం మంత్రి పదవులు ఉన్నాయి. కొత్తగా మళ్లీ మాల సామాజికవర్గానికి చెందిన వివేక్ కు పదవి ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తమవుతోందంటున్నారు. దీంతో ఈ ఇద్దరి నేతల వల్ల మంత్రి వర్గ విస్తరణకు బ్రేకులు పడ్డాయంటున్నారు. సీనియర్లు అయిన రాజగోపాల్, వివేక్ కు నచ్చజెప్పిన తర్వాతే ఈ విషయంలో ముందుకు వెళ్లాలని పార్టీ భావిస్తోందంటున్నారు.

Tags:    

Similar News