తెలంగాణ మంత్రివర్గ కూర్పు పై అనూహ్య ట్విస్ట్.. రాహుల్ అనూహ్య నిర్ణయం

మంత్రివర్గ విస్తరణలో కొందరి పేర్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.;

Update: 2025-04-02 07:24 GMT
తెలంగాణ మంత్రివర్గ కూర్పు పై అనూహ్య ట్విస్ట్.. రాహుల్ అనూహ్య నిర్ణయం

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన వేళ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 3న మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. పార్టీలోని ముఖ్య నేతలు సైతం జాబితా సిద్ధమైందని చర్చించుకున్నారు. తొలుత నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే, చివరి నిమిషంలో ఢిల్లీ స్థాయిలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మంత్రివర్గ విస్తరణలో కొందరి పేర్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నాయకులు కొత్త జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. మరో ఇద్దరు నేతల పేర్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి.

గత నెలలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో మొదట నలుగురిని భర్తీ చేయాలని నిర్ణయించారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. ఉగాది సందర్భంగా గవర్నర్‌తో భేటీ అయిన సమయంలోనూ సీఎం రేవంత్ మంత్రివర్గ విస్తరణ గురించి చెప్పినట్లు సమాచారం. కానీ, ఇప్పుడు విస్తరణ సమయం దగ్గర పడుతుండగా ఢిల్లీ కేంద్రంగా అనూహ్యమైన ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి.

మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కనుందనే విషయంపై రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వడంపై ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడైన రాజగోపాల్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇవ్వడం ఏమిటని రాహుల్ పార్టీ ముఖ్య నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో చేరిన సమయంలో వివేక్‌తో పాటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చామని పార్టీ నేతలు ఆయనకు వివరించారు. దీనిపై పూర్తిగా ఆలోచించిన తర్వాత తుది నిర్ణయం తెలియజేస్తామని రాహుల్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. సీనియర్ నేత జానారెడ్డి పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, ఆ జిల్లాలకు అవకాశం కల్పించాలని ఆయన తన లేఖలో కోరారు. ఇదే సమయంలో వివిధ సామాజిక వర్గాల నేతలు తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఢిల్లీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.

ఇప్పటికే సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాటికి శ్రీహరి, వివేక్ పేర్లు మంత్రి పదవుల కోసం ఖరారయ్యాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు రాహుల్ అభ్యంతరంతో ఈ జాబితాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. పార్టీలోని సీనియర్ నేతలు, సామాజిక అంశాలు, జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలు తెరపైకి రావడంతో ఈ నెల 3న జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఈరోజు ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Tags:    

Similar News