టీ.కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? అధికారం అచ్చిరావడంలేదా?

2023 ఎన్నికల్లో ఏ అంచనాలు లేని కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారం చేపట్టాక పార్టీ నేతలపై మెతక వైఖరి అవలంబించడంతో పరిస్థితి కట్టుతప్పుతోందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

Update: 2025-02-03 01:30 GMT

ఎన్నో పోరాటాల తర్వాత.. అనూహ్య రీతిలో తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆ అధికారాన్ని నిలబెట్టుకోవడంలో అయోమయాన్ని ఎదుర్కోంటాందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఎన్నికల హామీలను నెరవేర్చడానికి సీఎం రేవంత్ రెడ్డి విశేషంగా కృషి చేస్తున్నా, పార్టీ నేతలు ఆయనతో కలిసిరావడం లేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. తన కంటే సీనియర్లను మంత్రులు తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారికి ఎక్కువ గౌరవం ఇవ్వడం కూడా ప్రభుత్వంపై అదుపు లేకుండా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలనా అనుభవం లేకపోయినా, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటా బయటా యుద్ధం చేయాల్సిన పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయంటున్నారు.

2023 ఎన్నికల్లో ఏ అంచనాలు లేని కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారం చేపట్టాక పార్టీ నేతలపై మెతక వైఖరి అవలంబించడంతో పరిస్థితి కట్టుతప్పుతోందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి ఆపసోపాలు పడుతోంది. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులే కారణమన్న వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ ఎక్కడాలేని శక్తిని కూడగట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం వాగ్దానాన్ని అమలు చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచారు. అదేవిధంగా రైతు రుణ మాఫీ చేశారు. రైతు బంధు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం వంటి ఎన్నో హామీలను నెరవేర్చడంతోపాటు పదేళ్లుగా పంపిణీ చేయని రేషన్ కార్డులను ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేసిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో 13 నెలల పాలనను పోల్చి సొంత క్యాడరే డ్యామేజ్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గత నెలలో దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చారు. అదేవిధంగా ఫోర్త్ సిటీ కాన్సెప్ట్ తోపాటు, మూసీ ప్రక్షాళన, స్కిల్ యూనివర్సిటీ వంటి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ, ఈ పథకాలు, ప్రణాళికలపై కాంగ్రెస్ పార్టీ నుంచి తగిన ప్రచారం లభించడం లేదు. ఎక్కడ ప్రజలు ఈ పథకాలను అర్థం చేసుకుని ఆదరిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమను లెక్క చేయరో అన్న ఆందోళనే ఆ పార్టీలో ఎక్కవ మందిని వెంటాడుతోందని, ముఖ్యమంత్రిని తమ చెప్పుచేతుల్లో పెట్టుకోడానికి కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలిసారి అధికార హోదా అనుభవిస్తున్నారు. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ రెడ్డి 17 ఏళ్ల తక్కువ సమయంలోనే సీఎం స్థాయికి ఎదిగారు. ఆయన విజయ ప్రస్థానాన్ని అంగీకరించలేని కొందరు కాంగ్రెస్ నేతలు.. తమ ఇగోతో ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీనియర్లుగా వారికి మితిమీరిన గౌరవం ఇవ్వడం వల్ల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికార కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రతిపక్షానికి అస్త్రం అవ్వగా, తాజాగా పది మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ అయ్యారనే సమాచారం పెను భూకంపాన్ని తీసుకువచ్చినట్లైంది.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల పట్ల సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. హైడ్రా పేరిట హైదరాబాద్ లో ఆక్రమణలను తొలగించేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతల ఆక్రమణలు, రాజకీయాల నుంచి రిటైరైన కాంగ్రెస్ నేతలు అనుభవంలో ఉన్న భవనాలను పునాదులతో సహా పెకిలించేస్తున్నారు. కానీ, సొంత పార్టీ నేతలను అదుపు చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై అధిష్టానం కూడా జోక్యం చేసుకున్నా, కొందరు మంత్రులు తీరు మారడం లేదని టాక్ వినిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News