తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త శకం.. అన్నప్రాసన నాడే ఆవకాయ!

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన్నప్పటికీ తెలంగాణలో పదేళ్ల అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ!

Update: 2024-09-18 14:30 GMT

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన్నప్పటికీ తెలంగాణలో పదేళ్ల అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని టీపీసీసీ చీఫ్ గా ఒడ్డున పడేసిన రేవంత్ రెడ్డి సీఎం అయి ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.. మరి ఆ స్థానంలోకి వచ్చేది ఎవరు? అనేది అత్యంత ఉత్కంఠ నెలకొంది. దీనికి తెరదించుతూ తొలి నుంచి పార్టీనే నమ్ముకున్న, రేవంత్ కు అన్ని విధాలా సహకరించిన మహేష్ కుమార్ గౌడ్ ను టీపీసీసీ చీఫ్ పదవి వరించింది. ఆయన బాధ్యతల స్వీకారంతోనే తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు పలు సామాజికవర్గాలు టీపీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టాయి. కానీ, తొలిసారిగా గౌడ్ వర్గానికి చెందిన నాయకుడు టీపీసీసీ చీఫ్ కావడమే ఇక్కడ విశేషం.

వెలమ నుంచి మాల వరకు

ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించినవారిలో వెలమ (జలగం వెంగళరావు -2సార్లు), గడ్డం వెంకటస్వామి (మాల) వంటి దిగ్గజ నాయకులతో పాటు కొణిజేటి రోశయ్య (వైశ్య), ఎం.సత్యనారాయణరావు (వెలమ) వంటి సీనియర్లు ఉన్నారు. ఇక రెడ్డి వర్గానికి చెందినవారి సంఖ్య చాలా పెద్దదే. నీలం సంజీవరెడ్డి నుంచి నేటి విభజిత ఏపీలో వైఎస్ షర్మిల వరకు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ఏపీసీసీ చీఫ్ పదవిని చేపట్టారు. మున్నూరు కాపు, కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లిపూడి పల్లంరాజు, కె.కేశవరావు, వి.హనుమంతరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ తదితరులున్నారు. మరోవైపు కోన ప్రభాకర్ రావు వంటి బ్రాహ్మణ నాయకుడూ ఏపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ఇక తెలంగాణ ఏర్పాటుతోనే పొన్నాల లక్ష్మయ్య (మున్నూరు కాపు)కు చాన్స్ దక్కింది. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి తెలంగాణలో గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అవకాశం వచ్చింది.

ముందుంది మహా స్థానిక సమరం

కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా టీపీసీసీ చీఫ్ కావడం అంటే మామూలు మాటలు కాదు. మహేష్ గౌడ్ కు ఇప్పుడు ఆ అరుదైన అవకాశం దక్కింది. అయితే, అదే ఇప్పుడు ముళ్ల కిరీటం కూడా. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండడంతో తెలంగాణలో కాంగ్రెస్ క్యాడర్ బాగా బలహీనపడింది. అప్పట్లో ఎమ్మెల్యేలే కాదు.. ద్వితీయ శ్రేణి నాయకులూ పార్టీని వీడి వెళ్లిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్లీ కాంగ్రెస్ లోకి వస్తుంటారు. ఇది సహజమే. అయితే, పదేళ్లుగా అంటిపెట్టుకున్న కార్యకర్తలకు న్యాయం చేయడంతో పాటు కొత్తవారితో సమతూకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మరో ముఖ్య సంగతి స్థానిక సంస్థల ఎన్నికలు.

జీహెచ్ఎంసీనీ కొట్టాలి..

2009 తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురలేదు. అప్పుడు మేయర్ గా ఎన్నికైన నాయకురాలు పార్టీలోనే లేరు. ఇప్పుడు జీహెచ్ఎంసీలో అసలు బలమే లేదు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ తర్వాత నాలుగో స్థానంలో ఉంది కాంగ్రెస్. ఇక కుంభస్థలంగా భావించే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలను కొట్టాలి. అంతకుముందే జరగనున్న పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ గెలుపొందాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లనూ కైవసం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు అది కొంత ప్లస్ పాయింటే. ఇదే సమయంలో పార్టీపై పట్టు సాధించాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కూడా ముఖ్యమే. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ బలంగా ఉండే వీలుంటుంది. మొత్తమ్మీద చెప్పాలంటే.. అన్నప్రాసన నాడే ఆవకాయ అన్న సామెతకు తగ్గట్లు టీపీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ కు తొలి ఏడాదిలోనే అనేక సవాళ్లు ఎదురవనున్నాయి.

Tags:    

Similar News