ఏపీ పిల్లలకు ఇంత అన్యాయమా? ఇదేం న్యాయం రేవంత్?

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గురించి తెలిసింతనే షాక్ కు గురి కావటం ఖాయం.

Update: 2025-02-28 03:45 GMT

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం గురించి తెలిసింతనే షాక్ కు గురి కావటం ఖాయం. విడిపోయి పదేళ్లు అయ్యాక కూడా ఏపీ నుంచి అది కావాలి? ఇది కావాలి? అందులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలి? గౌరవ మర్యాదలు కల్పించాలని కోరుకునే తెలంగాణ నేతలు మాత్రమే కాదు.. తరచూ ఏదో ఒక కోరిక కోరే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ సైతం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం.. ఏపీ రాష్ట్ర విద్యార్థులకు చేజారే అవకాశాల గురించి కూడా గళం విప్పాల్సిన అవసరం ఉంది.

ఇంతకూ ఏం జరిగిందంటే.. ఇంజినీరింగ్ తో పాటు ఇతర వ్రత్తి విద్యా కోర్సుల్లో ఇప్పటివరకు అమలు అవుతున్న 15 శాతం నాన్ లోకల్ కోటా లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణవాసులే పొందనున్నారు. అంటే.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ సీట్లకు పోటీ పడేందుకు అవకాశం ఉండదు. రాష్ట్ర విభజన పూర్తి అయి పదేళ్లు అయిన సందర్బంగా తెలంగాణ స్థానికత.. 15 శాతం నాన్ లోకల్ కోటాకు అర్హులు ఎవరు? అనే దానికి స్పష్టత ఇస్తూ గతంలో జారీ చేసిన ఆదేశాల్ని తాజాగా ప్రభుత్వం సవరించింది.

దీనికి సంబంధించిన జీవో తాజాగా జారీ అయ్యింది. గతంలో మాదిరిగానే కన్వీనర్ కోటా 70 శాతం సీట్లలో 85 శాతం సీట్లను స్థానికులకు.. అంటే తెలంగాణ రాష్ట్ర పరిధిలోని ఓయూ రీజియన్ అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం స్థానికేతర కోటాపై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం.. 2011లో జారీ చేసిన జీవో 74లో పేర్కొన్న ఓయూ రీజియన్ తో పాటు ఆంధ్రా..శ్రీక్రిష్ణదేవరాయవారు పోటీ పడే వీలుంది. తాజా జీవోలో ఆ రెండు వర్సిటీలను తొలగించింది. దీంతో.. తెలంగాణ పరిధిలోని విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది.

ఇంజనీరింగ్.. టెక్నాలజీ.. ఫార్మసీ.. ఆర్కిటెక్చర్.. ఫార్మా డి.. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్..కంప్యూటర్ అప్లికేషన్ లా.. ఎడ్యుకేషన్.. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఈ కోర్సుల్లో అండర్ గ్రాడ్యుయేట్ తో పాటు పీజీ సీట్ల భర్తీకీ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ చెప్పేదేమంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో తెలంగాణ వారికి చోటు కల్పించాలని.. తమకు సముద్ర తీరం లేదు కాబట్టి. డైపోర్టు కింద తమకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఏపీ సర్కారును కోరటం తెలిసిందే.

తిరుమలకు వచ్చే తెలంగాణ వారికి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు తమకు గౌరవప్రదమైన వాటా కావాలని కోరటం.. అందుకు తగ్గట్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించటం తెలిసిందే. అలాంటప్పుడు.. ఇప్పటివరకు ఉన్న విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనసాగించొచ్చు కదా? ఏపీ విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే ఈ నిర్ణయం మీద ఏపీ సర్కారు స్పందించదా? తమ అవసరాలకు మొహమాటం లేకుండా అడిగి మరీ తీసుకునే తెలంగాణ సర్కారు.. అదే సమయంలో ఏపీ విషయంలోనూ ఇచ్చి పుచ్చుకునే ధోరణిని ప్రదర్శించాలి కదా?

కోటా విషయంలో ఇప్పుడున్న విధానాన్ని మార్చటం వల్ల.. ఏపీ విద్యార్థులు కొంత మేర నష్టపోతారు కదా? విడిపోయి కలిసి ఉండటం అనేదానికి ఇదేనా అర్థమన్నది ఒక ప్రశ్న అయితే.. తమకు అవసరమైన వాటిని ఇప్పటికి అడిగి తీసుకునే వేళ.. ఇచ్చే కొద్దిపాటి విషయాల్లోనూ అలాంటి అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ప్రదర్శించదు? తాజా జీవో నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News