తెలంగాణ వరదలు.. ఒక యువ శాస్త్రవేత్తను కబళించాయి.. అసలేం జరిగిందంటే?

జాతీయ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో ఓ యువ శాస్త్రవేత్త ప్రాణాలు పోయాయి.

Update: 2024-09-02 06:24 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను రెండు రోజులుగా వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండిపోయాయి. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. కాలనీలు, గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జాతీయ రహదారులు సైతం దెబ్బతిన్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో ఓ యువ శాస్త్రవేత్త ప్రాణాలు పోయాయి.


ఎన్నో కలలు.. మరెన్నో ఆశలతో ఢిల్లీ బయలుదేరిన ఆ యువ శాస్త్రవేత్తను మార్గమధ్యలోనే వరదలు బలితీసుకున్నాయి. తండ్రితో కలిసి ప్రయాణిస్తున్న కారు వరదల్లో కొట్టుకుపోయింది. చివరకు విషాదం మిగిల్చింది. తండ్రీకూతుళ్లు ఇద్దరూ చనిపోయారు.

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని రాయిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఆఫ్ క్రాప్ రెసిస్టెన్స్ సిస్టమ్ రీసెర్చ్‌ (ICAR)లో యువ శాస్త్రవేత్త. తన అన్న ఎంగేజ్‌మెంట్ కోసం ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. మళ్లీ తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది. తన తండ్రి నూనావత్ మోతిలాల్‌తో కలిసి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు కారులో బయలుదేరారు.

మార్గమధ్యలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం హైలెవెల్ బ్రిడ్జిపై ఆకేరు నది వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో ఆ ప్రవాహంలో వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. అప్పటికే అశ్విని ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులతో చివరి కాల్ సైతం మాట్లాడారు. ‘మేం వరదల్లో చిక్కుకున్నాం. మా మెడ వరకు నీరు వచ్చిచేరింది’ అని చెప్తుండగానే ఒక్కసారిగా కాల్ కట్ అయింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అంతటి వర్షంలోనే వెతికసాగారు. చివరకు కారు మిస్ ఆకేరు నది వంతెన సమీపంలో అశ్విని మృతదేహం లభ్యమైంది. అయితే.. ఆమె తండ్రి మోతిలాల్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకనేలేదు.

అశ్విని అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో ఏజీబీఎస్సీ పూర్తి చేసి, పీజీ, పీహెచ్‌డీ చేసింది. జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలిలో వందల మందితో పోటీపడి జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఏజీ బీఎస్సీలో బంగారు పతకంతోపాటు మూడు రజతాలు, విశ్వవిద్యాలయం స్థాయిలో ఆరు బంగారు పతకాలు సాధించింది. ఢిల్లీలో ఏజీ ఎంఎస్‌సీలో బంగారు పతకం సాధించింది. అందుకే ఆమెను కుటుంబసభ్యులు, స్నేహితులు ముద్దుగా జాతిరత్నం అంటూ పొగడ్తూ ఉంటారు. అశ్విని మృతిపై పలువురు శాస్త్రవేత్తలు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News