కిడ్నీ రాకెట్ కేసు... తెలంగాణ వైద్యారోగ్య మంత్రి కీలక ఆదేశాలు!

ఈ వ్యవహారానికి సంబంధించిన వేర్లు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకూ వ్యాపించాయనే చర్చా జరుగుతుంది.

Update: 2025-01-24 13:13 GMT

హైదరాబాద్ లోని అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన "కిడ్నీ రాకెట్" వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన వేర్లు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకూ వ్యాపించాయనే చర్చా జరుగుతుంది. ఈ సమయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును తెలంగాణ సీఐడీకి అప్పగించింది.

అవును... అలకనంద ఆస్పత్రిలో వెలుగు చూసిన "కిడ్నీ రాకెట్" కేసును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మరోవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ మేరకు పోలీసులు ఇప్పటికే ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, మరో వక్తి గోపి సహా 8 మందిని అదుపులోకి తీసుకోగా... వారిలో సుమంత్, గోపీని కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో గతంలో ఇలాంటి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల ఆచూకీని కనిపెట్టి, వారిని అదుపులోకి తీసుకుని విచారించే పనిలోనూ పోలీసులు ఉన్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... గతంలోని కిడ్నీ రాకెట్ కేసులో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని.. అతడి ద్వారా ఈ తరహా రాకెట్స్ లో ప్రమేయం ఉన్న కొంతమంది పేర్లు, ఫోన్ నెంబర్లూ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ ముఠా అంతా కర్ణాటక, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నీ దాతలు, గ్రహీతల్ని తీసుకురావడలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే అలకనంద ఆస్పత్రి ఆధ్వర్యంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ గతంలోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారని అంటున్నారు. ఒక కిడ్నీ ఆపరేషన్ చేసే సమయంలో సుమారు 20 మంది వరకూ వైద్యులు, సిబ్బంది అవసరమవుతారని.. ఇంత మంది స్టాఫ్ ఈ ఆస్పత్రిలోనే ఉన్నారా.. బయట ఆస్పత్రుల నుంచి రప్పించారా అనే కోణంలోనూ దర్యాప్తూ చేస్తున్నారని తెలుస్తోంది.

కాగా... కిడ్నీ ర్యాకెట్ కేసులో కీలకంగా ఉన్న అలకనంద హాస్పటల్ 9 పడకలతో ప్రారంభమైందని.. ఇందులో ఎలాంటి ప్రాథమిక వసతులూ లేవని.. అలాంటప్పుడు అప్డేటెడ్ ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వంటి వాటికి అవకాశమే లేదని అంటున్నారని తెలుస్తోంది. దీంతో.. అసలు కథానాయకులు ఎవరనే విషయంపైనా దర్యాప్తు జరుగుతుందని చెబుతున్నారు!

ఈ నేపథ్యంలోనే ఈ కిడ్నీ రాకెట్ కేసును సీఐడీకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.

Tags:    

Similar News