అక్రమ కట్టడాలపై ఒక్కరోజు ఆగలేరా..? హైడ్రాపై హైకోర్టు ఫైర్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రా ఏర్పాటైన విషయం తెలిసిందే.

Update: 2024-09-28 05:58 GMT

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు హైడ్రా ఏర్పాటైన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే హైడ్రాను ఏర్పాటు చేసిందో.. అదే లక్ష్యంతో హైడ్రా దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ ముందుకు సాగుతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తూ భూములను రికవరీ చేస్తోంది.

అక్రమ కట్టడాల కూల్చివేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఒక్కసారిగా భగ్గుమంది. రోజుకు పదుల సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ దూసుకెళ్తున్న హైడ్రా పనితీరును తప్పుపట్టింది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఏకంగా నోటీసులు జారీచేసింది. వ్యక్తిగతంగా లేదంటే వర్చువల్‌గా విచారణకు సోమవారం హాజరు కావాలని పేర్కొంది. ఇటీవల అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణనగర్‌లో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ మహ్మద్ రఫీ, గణేష్ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ఆస్పత్రి భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. కోర్టులో ఈ కేసు పెండింగులో ఉందని బాధితులు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దాంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు పెండింగులో ఉన్నదని చెప్పిన కూడా కూల్చివేశారంటూ పిల్ వేశారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టులో విచారణలో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

అక్రమ నిర్మాణాలపై ఎందుకింద దూకుడుగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఫైర్ అయింది. శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా..? ఒక్కరోజు కూడా ఆగలేరా అని నిలదీసింది. అసలు హైడ్రాకు చట్టబద్ధత ఏంటని గతంలోనే ప్రశ్నించామని.. ఇప్పుడు కూడా అడుగుతున్నామని పేర్కొంది.

హైడ్రా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు తహసీల్దార్ ఈనెల 21న లేఖ రాశారని, జీవో 99, తహసీల్దార్ లేఖ అనుసరించి ఇలా చేసినట్లు వివరించారు. ప్రభుత్వ స్థలాలు కాపాడేందుకు సిబ్బందిని, మిషన్లను పంపించినట్లు చెప్పారు. కాగా.. పిటిషన్లపై విచారణ ముగిసేదాకా నిర్మాణాలపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని గతంలోనే ఆదేశాలు ఉన్నాయని హైడ్రా పేర్కొంది. విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో హైడ్రా ఎలా వ్యవహరించబోతోంది..? ఇప్పటికే ఈ రోజు నుంచి మూసీ పరిధిలో కట్టడాలను నేలమట్టం చేసేందుకు సిద్ధమైన హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..? హైకోర్టు సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతుందా..? లేదంటే అదే దూకుడు ప్రదర్శిస్తుందా..? అని ఇప్పుడు అంతటా చర్చ కొనసాగుతోంది.

Tags:    

Similar News