లీజు వివాదం.. నల్గొండ పార్టీ ఆఫీస్ విషయంలో బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు ఇదే

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.

Update: 2024-09-19 05:34 GMT

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీలోని కొందరు నేతలు పలు అక్రమాలకు పాల్పడినట్లుగా చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. పలు భూ ఆక్రమణలకు సైతం తెగబడ్డారని విమర్శలు ఉన్నాయి. ఒక విధంగా ఆ పదేళ్లు వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడిచిందన్న ప్రచారం రాష్ట్రంలో ఉంది. అధికారంలో ఉన్నాం కదా.. తమను ఎవరు అడిగేది అని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని టాక్ ఉంది.

నిన్న ఆ పార్టీకి హైకోర్టు బిగ్ షాక్‌నిచ్చింది. అధికారంలో ఉన్నామనే భావనతో హైదరాబాద్-నల్లగొండ ప్రధాన రహదారి వెంట నల్లగొండ పట్టణ శివారులో ఆగ్రోస్ ఇండస్ట్రీస్‌కు చెందిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ లీజుకు తీసుకుంది. 99 ఏళ్లకు గజానికి కేవలం రూ.100 చొప్పున ఏడాదికి చెల్లించేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా పార్టీకి లీజుకు ఇచ్చింది. దాంతో ఎలాంటి అనుమతులు లేకుండానే ఆ సమయంలో అక్కడి నేతలు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. దాంతో అప్పటి నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. అయితే.. గులాబీ పార్టీ అధికారంలో ఉండడం.. స్థానిక నేతలను ప్రశ్నించలేక అధికారులు సైతం సైలెంటుగా ఉండడంతో ఆ లీజు వ్యవహారం అలాగే కొనసాగుతూ వచ్చింది.

కట్‌చేస్తే.. మొన్నటివరకు ఆ భవనాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి ఈ వివాదం మరింత రాజుకుంది. ఆ భవనం నిర్మాణం, లీజు వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీశారు. వెంటనే అధికారులను నిలదీశారు. దీంతో వారు వెంటనే బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించడంపై వివరణ ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ నోటీసులను సవాల్ చేస్తూ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. భవనాన్ని క్రమబద్ధీకరించుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తిచేసింది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు చివరకు బీఆర్ఎస్ పార్టీకే ఝలక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతులు లేకుండా భవన నిర్మాణం ఎలా చేపడుతారని నిలదీసింది. అనుమతులు లేని భవనంలో ఐదేళ్లపాటు అందులో కార్యకలాపాలు ఎలా నిర్వర్తిస్తారని అడిగింది. 15 రోజుల్లోగా ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. అంతేగాకుండా రూ.లక్ష ఫైన్ చెల్లించాలంది. దాంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా నల్లగొండ నేతలు షాక్‌కు గురయ్యారు.

Tags:    

Similar News