తెలంగాణ ఎమ్మెల్యేల్లో హరీశ్ రావు టాప్.. కాంగ్రెసులో శ్రీధర్ బాబు బెస్ట్
తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.;

తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల్లో టాప్ టెన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సగం మంది ఉండటం విశేషం. అందులోనా టాప్ -1లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నిలిచారు. అదేసమయంలో అదేపార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచారు.
పీపుల్స్-సౌత్ ఫస్ట్ సంయుక్తంగా మార్చి 28 నుంచి ఈ నెల 3 వరకు సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుంచి 500 శాంపిల్స్ కంప్యూరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ - ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఈ సర్వేలో మినహాయించారు. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల్లో 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 36 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 58 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది.
అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురు పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 12 మంది పనితీరు బాగుందని, 13 మంది పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని తేలింది. బీజేపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఒకరి పనితీరు బాగోలేదని, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని చెప్పారు. ఎంఐంఎం ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, మరో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సీపీఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.
కాగా, 10 మంది టాప్ ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్ నేత హరీశ్రావు ప్రథమ స్థానంలో, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి 10 స్థానంలో నిలిచారు. టాప్ 10లో ఐదుగురు బీఆర్ఎస్, ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, ఒక ఎంఐఎం ఎమ్మెల్ల్యే ఉన్నారు. టాప్ 10లో కాంగ్రెస్ పార్టీ నేతలు మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు 3వ స్థానంలో ఉండగా, హుజుర్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు.
ఇక టాప్ 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత కేసీఆర్ 2వ స్థానంలో, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 7వ స్థానంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 5వ స్థానంలో, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 6వ స్థానంలో ఉన్నారు. టాప్ 10లో బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 8వ స్థానంలో, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ చంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ 4వ స్థానంలో ఉన్నారు.
మహిళా టాప్ ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో, అధికార కాంగ్రెస్ మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క రెండో స్థానంలో ఉన్నారు. మరో మహిళా మంత్రి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 7వ స్థానంలో నిలిచారు. మహిళా టాప్ ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ నుంచి కోదాద ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి 4వ స్థానంలో, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికా రెడ్డి 5వ స్థానంలో, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి 8వ స్థానంలో, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని 9వ స్థానంలో ఉన్నారు.బీఆర్ఎస్ కు సంబంధించి మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి 3వ స్థానంలో, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి 6వ స్థానంలో ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో టాప్ 10లో మంత్రి, ముంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మొదటి స్థానంలో ఉండగా, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ 10వ స్థానంలో నిలిచారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2వ స్థానంలో, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 3వ స్థానంలో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 4వ స్థానంలో, సీతక్క 5వ స్థానంలో, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు 6వ స్థానంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ 7వ స్థానంలో, తుమ్మల నాగేశ్వరరావు 8వ స్థానంలో, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 9వ స్థానంలో ఉన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టాప్ 10లో సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా, సునితా లక్ష్మారెడ్డి 10వ స్థానంలో నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2,బాల్కొండ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 3, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 4,సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ 5, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ 6, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 7,మాధవరం కృష్ణారావు 8, సుధీర్ రెడ్డి 9వ స్థానంలో నిలిచారు.