తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలకు ఓకే.. ఎప్పుడంటే?

అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదన్న సామెతకు తగ్గట్లే తాజా పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-10-27 15:30 GMT

అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదన్న సామెతకు తగ్గట్లే తాజా పరిణామం చోటు చేసుకుంది. తమకు అవసరమైనది.. కావాల్సిన వాటి విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా అడిగి సాధించుకోవటంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ముందుంటారు. రాష్ట్ర విభజన పాఠాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు ఇప్పటికి అలవాటు చేసుకోలేదు. పదేళ్ల ఉమ్మడి రాజధాని కళ్ల ముందు వెళ్లిపోతున్నా.. హైదరాబాద్ కు సంబంధించి ఫలానా విషయంలో తమకు అవసరమైన వెసులుబాట్ల గురించి ప్రశ్నించింది లేదు. డిమాండ్ చేసింది లేదు.

ఇదే పరిస్థితి తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఎదురైతే పరిస్థితి మరోలా ఉండేది. ఇందుకు చక్కని ఉదాహరణ ఒకటి చెప్పొచ్చు. తిరుమలకు వెళుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధులకు.. వారి సిఫార్సు లేఖల్నిటీటీడీ పరిగణలోకి తీసుకోవటం లేదు. దీనిపై అదే పనిగా ప్రశ్నించిన తెలంగాణ ప్రజాప్రతినిధులు తమకు కావాల్సింది సాధించుకున్నారు. అదే సమయంలో రాష్ట్ర విభజన వేళలోనేకాదు.. విభజన తర్వాత కూడా ఏపీ ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా తెలంగాణలో తమకు అవసరమైన వాటి గురించి అడిగింది లేదు. ప్రశ్నించింది లేదు. తెలుగు వర్సిటీకి ఉన్న శ్రీపొట్టి శ్రీరాములు పేరును తీసేస్తే.. మా గుర్తుకు ఎందుకు ఉంచుకోరు? విడిపోయి కలిసి ఉండాలనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతానికి గుర్తుగా అలా ఉంచుకోవాలని ఎవరైనా అడిగారా? అడిగితే కాదంటే అదో పద్దతి.

తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తపించే ప్రజాప్రతినిధులను చూసిన తర్వాత అయినా ఏపీ ప్రజాప్రతినిధులకు తమకు లేనిది.. తెలంగాణ ప్రజాప్రతినిధుల్లో ఉన్నది ఏమిటో అర్థమవుతుంది. తిరుమలలోటీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని కోరినప్పుడు.. తాము కూడా ఏపీ ప్రజల సౌకర్యార్థం ఫలానా చేస్తామని ఎందుకు చెప్పరు? అదే సమయంలో తెలంగాణ ప్రజలు కోసం తాము ఒప్పుకున్నప్పుడు, ఏపీ ప్రజల కోసం అదనపు వసతి ఏం ఇస్తున్నారు? అని అడగటం ఎందుకు చేతకాదు?అన్నది ప్రశ్న.

తాజాగా యాదాద్రికి వచ్చిన ఏపీ కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో టీటీడీ బోర్డు ఏర్పాటు అవుతుందని.. అప్పటి నుంచి తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. వారికి అవసరమైన వసతి సౌకర్యంతో పాటు.. దర్శన సదుపాయాల్ని కల్పిస్తామన్నారు. మరో రెండు నెలల్లో టీటీడీ కొత్త బోర్డు ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News