ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు..

తాజాగా... మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Update: 2024-11-12 08:22 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయి జైలుకు వెళ్లగా.. నిన్న బీఆర్ఎస్ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. తాజాగా... మరో నలుగురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుతో వెళ్తోంది. ఇప్పటివరకు ఈ కేసులో అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చినట్లయింది. ఒకరి తరువాత మరొకరికి నోటీసులు జారీ అవుతుండడంతో రాజకీయవర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు నోటీసులు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ స్టేషన్‌కు విచారణ నిమిత్తం రావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిన్న సాయంత్రమే ఆయనను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనగా.. దానికి ఆయన ఈనెల 14న విచారణకు హాజరవుతానని సమాధానం ఇచ్చారు. అయితే.. తాజాగా మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కావడం బీఆర్ఎస్ నేతలకు ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావు, రిటైర్డ్ అదనపు ఎస్పీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ భుజంగరావు, అదనపు ఎస్పీ తిరుపతన్న, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ వేణుగోపాల్ రావు, గట్టుమల్లు భూపలి అరెస్ట్ అయ్యారు. వీరిలో ప్రభాకర్ రావు మాత్రం అమెరికాలో ఉండిపోయారు. కేసు విషయం బయటకు వచ్చినప్పుడే ఆయన అమెరికాకు పరాయ్యారు. వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, సినిమా, వ్యాపారంలోని ప్రముఖుల ఫోన్లన ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

గత ఎన్నికలకు ముందే పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనతోపాటే మరికొందరు ఇతర పార్టీల నేతలు కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. దాంతో కాంగ్రెస్ అధికారం చేపట్టాక ఈ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. రేవంత్ అనుమానించినట్లుగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు రుజువైంది. అంతేకాకుండా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో అప్పటి నుంచి ప్రభుత్వం ఈ కేసుపై సీరియస్‌గా విచారణ చేయిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడినట్లుగా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందులో భాగంగానే మొన్నటి వరకు అధికారుల విచారణ సాగగా ఇప్పుడు రాజకీయ నేతలను విచారణకు పిలుస్తుండడంతో చర్చకు దారితీసింది.

ఇప్పటికే సమన్లు అందుకున్న లింగయ్య మరో రెండు రోజుల్లో విచారణకు హాజరుకాబోతున్నారు. ఆయన విచారణకు హాజరుకాకముంటే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడంపై కలకలం రేపింది. ఫోరెన్సిక్ రిపోర్టు ద్వారా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకసారే నలుగురికి నోటీసులు వెళ్లడంతో.. తదుపరి మరే నాయకుడికి నోటీసులు పోతాయా..? ఎవరు విచారణకు రావాల్సి ఉంటుందా..? అని బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది.

Tags:    

Similar News