ఆపరేషన్-16 : సీఎం రేవంత్ రెడ్డి తాజా టార్గెట్ ఇది..

తెలంగాణ పాలిటిక్స్‌ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఏదో జరగబోతుందంటూ అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి సంకేతాలు అందుతున్నాయి.

Update: 2025-02-20 18:30 GMT

తెలంగాణ పాలిటిక్స్‌ వెరీ ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. ఏదో జరగబోతుందంటూ అధికార కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి సంకేతాలు అందుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, ప్రతిపక్షం అడ్రస్ గల్లంతు చేస్తామని హస్తం నేతలు సవాళ్లు, ప్రతి సవాళ్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో తెలంగాణ గట్టు మీద రాజకీయం సలసల మండుతోంది. వేసవి తాపం ముందే తగిలినట్లు రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తుండటమే హాట్ టాపిక్ అవుతోంది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి దాదాపు 14 నెలలు కావస్తోంది. ప్రభుత్వ పరంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో అనుకున్న మైలేజ్ రావడం లేదని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. దీనికి కారణం సొంత పార్టీలో ప్రత్యర్థులతోపాటు ప్రతిపక్షం గట్టిగా పోరాడం కూడా కారణంగా విశ్లేషిస్తున్నారట.. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

14 నెలలుగా సీఎంగా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక విషయాలను సీఎం ఛేదించలేకపోతున్నారనే టాక్ ఉంది. అందులో ప్రధానమైనది మంత్రివర్గ విస్తరణ. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. కానీ మంత్రివర్గంపై ఓ పరిమితి ఉండటంతో అందరికీ పదవులు ఇవ్వడం కుదరలేదని అంటున్నారు. ఇదే సమయంలో ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ చికాకు చేస్తోందని అంటున్నారు. అయితే తనను ఇబ్బంది పెడుతున్న సీనియర్లను కట్టడి చేయడంతోపాటు ప్రతిపక్షాన్ని నీరుగార్చే ఓ బలమైన అడుగు వేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

బీఆర్ఎస్ నుంచి నిలిచిపోయిన వలసలను తిరిగి ప్రారంభించడం ద్వారా పార్టీపైన ప్రతిపక్షంపైనా పట్టుసాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. వీరంతా పార్లమెంట్ ఎన్నికలకు కాస్త అటు, ఇటు చేరిన వారే. అయితే పదవులపై క్లారిటీ లేకపోవడంతో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తామని చెప్పి ఆగిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ తనను మాటమాటకు చికాకు పెట్టడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం మార్చుకున్నారని అంటున్నారు.

బీఆర్ఎస్ నుంచి రావాల్సిన ఎమ్మెల్యే పేర్లను రెడీ చేయాలని తన అనుయాయులను సీఎం ఆదేశించారని గాంధీభవన్ లో టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ఆపరేషన్ ను స్టార్ట్ చేయాలని సీఎం నిర్ణయించారంటున్నారు. స్థానిక ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే ఒకరో ఇద్దరో కాకుండా ఏకంగా 16 మందిని ఒకేసారి కాంగ్రెస్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పది మంది.. కొత్తగా వచ్చే 16 మందితో కలిపితే బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా తీసేయవచ్చిని అంతేకాకుండా ఆ పార్టీ శాసనసభాపక్ష హోదాను లాగేయడం ద్వారా వలస వచ్చిన ఎమ్మెల్యేలు అందరినీ న్యాయ వివాదాల నుంచి రక్షించవచ్చని సీఎం భావిస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుతం పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. త్వరలో ఈ వివాదంపై తీర్పు వెలువడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ శాసనసభాపక్షం విలీనం చేయడం ద్వారా ఎమ్మెల్యేలను చట్టం ద్వారా రక్షణ కల్పించవచ్చని న్యాయ నిపుణుల సలహాతో సీఎం పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. తాను అనుకున్నట్లు బీఆర్ఎస్ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు వస్తే.. పార్టీలో గొణుగుతున్న నేతల నోళ్లు మూయించొచ్చని సీఎం వ్యూహంగా చెబుతున్నారు. మొత్తానికి ఆపరేషన్ - 16 దిశగా వేస్తున్న అడుగులు బీఆర్ఎస్ పార్టీని టచ్ చేస్తాయా? అనే ఆసక్తిని పెంచుతున్నాయి.

Tags:    

Similar News