6729 ఔట్ : కేసీఆర్ పెట్టించారు.. రేవంత్ తొలగించారు

అయితే రేవంత్ సర్కార్ రావడంతో ఇప్పుడు నాడు రిటైర్ అయినా కొనసాగుతున్న అందరినీ సాగనంపే కార్యక్రమాన్ని తాజాగా మొదలుపెట్టింది.;

Update: 2025-03-28 08:29 GMT
6729 ఔట్ : కేసీఆర్ పెట్టించారు.. రేవంత్ తొలగించారు

గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం తో కలిసి పనిచేసి నాటి సీఎం కేసీఆర్ మెప్పుపొందిన వారు ఎందరో రిటైర్ అయ్యక కూడా పలు పోస్టుల్లో నామినేట్ చేయబడ్డారు. వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి జీతాలు అందేవి. అయితే రేవంత్ సర్కార్ రావడంతో ఇప్పుడు నాడు రిటైర్ అయినా కొనసాగుతున్న అందరినీ సాగనంపే కార్యక్రమాన్ని తాజాగా మొదలుపెట్టింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సర్వీసు నుంచి పదవీ విరమణ పొందినప్పటికీ, కుర్చీలను వదలని ఉద్యోగులపై కొరడా ఝళిపించింది. పెన్షన్లు తీసుకుంటూనే కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారిని తక్షణమే తొలగించాలని ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 6,729 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారు.

ముఖ్యంగా మునిసిపల్ శాఖలో ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఒక్క ఈ శాఖలోనే 177 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై కొత్తగా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించాలంటే తప్పనిసరిగా నోటిఫికేషన్లు జారీ చేసి, నిబంధనల ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ ప్రభుత్వ నిర్ణయంతో ఏళ్ల తరబడి ప్రభుత్వ కొలువుల్లో కొనసాగుతున్న పలువురు ప్రముఖులు కూడా తమ పదవులను కోల్పోనున్నారు. వారిలో మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌ జి.కిషన్‌రావు, హెచ్‌ఎండిఏ కన్సల్టెంట్ ఇంజినీరు బీఎల్‌ఎన్‌ రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్‌కో డైరెక్టర్లు వంటి వారు ఉన్నారు. వీరందరినీ తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఒకవేళ వీరిలో ఎవరి సేవైనా ప్రభుత్వానికి అవసరమని భావిస్తే, వారిని తిరిగి నియమించుకోవడానికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ నిర్ణయం వివిధ ప్రభుత్వ శాఖల్లోని రిటైర్డ్ అధికారులపై ప్రభావం చూపనుంది. హెచ్‌ఎండిఏ, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ వాటర్‌వర్క్స్, మెట్రోరైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ వంటి విభాగాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఆర్డీవోలు, డీఎఫ్‌ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, సెక్షన్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ రేంజ్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ల నుంచి సహాయక ఇంజనీర్లు, అటెండర్ల వరకు పలు క్యాడర్లకు చెందిన ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఏర్పడనున్నాయి. దాదాపు 6,729 పోస్టులు ఖాళీ కానుండటంతో కొత్తవారికి ఉద్యోగాలు పొందే అవకాశం లభించనుంది. ఇప్పటికే మునిసిపల్ శాఖలో చర్యలు ప్రారంభం కాగా, విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను కూడా తొలగించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇరిగేషన్ శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. రెవెన్యూ, దేవాదాయం, ఆర్‌అండ్‌బీ, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు సహా అన్ని శాఖలు కూడా త్వరలోనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయనున్నాయి.

అయితే, ఈ తొలగింపుల అనంతరం కొద్దిమంది విశ్రాంత ఉద్యోగులకు మాత్రం తిరిగి అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయా విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 100 మందిని కొత్త నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించే అవకాశం ఉంది. ముఖ్యంగా మెట్రో రైల్ ప్రాజెక్టు పర్యవేక్షణలో అనుభవం ఉన్న ఎన్‌వీఎస్‌ రెడ్డితో పాటు సాంకేతిక అంశాల్లో నిపుణులైన ఇంజనీర్లను కొనసాగించే వీలుంది.

మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్తవారికి అవకాశాలు కల్పించనుంది. 6,729 ఖాళీలు ఏర్పడటంతో త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ఖాళీల కారణంగా ప్రస్తుతం ఉద్యోగుల్లో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చర్యతో ప్రభుత్వ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆశిస్తున్నారు.

Tags:    

Similar News