బీజేపీ సీబీఐ డిమాండ్ వెనక మతలబేంటి ?!
ఇప్పుడు బీజేపీ కేసీఆర్ ను అరెస్టు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నది.
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లు చెబుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ బీజేపీ శాఖ ఇందిరాపార్క్ వద్ద దీక్షలకు దిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన దానిపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడం వెనక మతలబు ఏమిటి అన్న చర్చ తెలంగాణలో మొదలయింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో 13 అంశాల మీద 420 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా హామీలన్నీ ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు నిలదీయకుండా దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్న పరిస్థితులలో హఠాత్తుగా దీక్షలకు దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే దీని వెనక పెద్ద కథే ఉందని తెలుస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణలో సీబీఐ అడుగు పెట్టడాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు సీబీఐ మీద నిషేధం విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. నిషేధం ఎత్తివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు. ఇప్పుడు బీజేపీ కేసీఆర్ ను అరెస్టు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నది. సీబీఐ అప్పగించడం అంటే పరోక్షంగా సీబీఐ మీద నిషేధం ఎత్తివేయాలన్న డిమాండ్ దాగిఉన్నది. ఒకసారి సీబీఐ మీద నిషేధం ఎత్తివేస్తే రాష్ట్రంలో జరిగి అనేక అంశాల మీద సీబీఐ వేలు పెట్టే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఈ కొద్ది కాలంలోనే రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ అన్న ఆరోపణలు పెద్దఎత్తున వచ్చాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ ఎన్నికల ప్రచారంలో ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపించారు. రాష్ట్రంలో దోచి ఢిల్లీకి, ఇతర రాష్ట్రాల ఎన్నికల ఖర్చుకు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు.
కొత్త మద్యం బ్రాండ్ల అనుమతికి రూ.5 వేల కోట్లు చేతులు మారాయని, సన్నబియ్యం కొనుగోలులో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని, రాష్ట్రంలో రూ.42 కు దొరుకుతున్న సన్నబియ్యాన్ని రూ.57 కు కొనుగోలు చేస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి భట్టి శాఖలో నిధుల విడుదలకు కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోకి సీబీఐని అనుమతిస్తే కాంగ్రెస్ ప్రముఖులకు చిక్కులు తప్పవని చెబుతున్నాారు.
ఈ నేపథ్యంలో సిట్ ఉండగా సీబీఐ ఎందుకు ? కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ డిమాండ్ అని కాంగ్రెస్ నేతలు వాదిస్తుండగా, దమ్ముంటే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను అరెస్టు చేయాలని, కేసును సీబీఐకి అప్పగించాలని, కేసీఆర్ అరెస్టు చేయకుండా కాంగ్రెస్ కాపాడుతుందని బీజేపీ ఆరోపిస్తుంది. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి.