గతానికి భిన్నంగా ఈసారి మన పాలకుల్లో అత్యధికులు ప్రేమకు బందీలే!

సాధారణ కుటుంబం నుంచి వచ్చి భవిష్యత్ పై స్పష్టమైన లక్ష్యం నిర్దేశించుకుని జీవితాన్ని ఆ దిశగా సఫలం చేసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే.

Update: 2024-02-14 09:30 GMT

ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు.. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ సుఖాంతం కావడం ఓ విశేషం అయితే.. వారు జీవితంలో స్థిరపడి అత్యంత ఆనందగా గడుపుతుండడం మరో విశేషం. ప్రేమకు హద్దులు ఉండవు అంటారు.. స్థితిగతులను చూడదు అంటారు. యుక్త వయసు ప్రేమల సంగతి పక్కనపెడితే.. ఓ దశకు వచ్చాక ఏర్పడే ప్రేమలు మాత్రం భావి జీవితంపై అవగాహనతోనే అన్నట్లు ఉంటాయి. ఇదంతా ఎందుకంటే.. ఈరోజు ప్రేమికుల దినోత్సవం. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులవి ప్రేమ వివాహాలే కావడం విశేషం. కొందరు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలవి ప్రేమ పెళ్లిళ్లే. ఎక్కడైనా మంత్రివర్గంలో ఒకరిద్దరు ప్రేమ వివాహాలు చేసుకున్న వారు ఉండడం సహజం. కానీ, ఇక్కడ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మరో ఇద్దరు మంత్రులదీ ప్రేమ పెళ్లే. వారెవరో చూడండి..

సామాజిక అంతరాలున్నా..

సాధారణ కుటుంబం నుంచి వచ్చి భవిష్యత్ పై స్పష్టమైన లక్ష్యం నిర్దేశించుకుని జీవితాన్ని ఆ దిశగా సఫలం చేసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆయన వివాహంలోనూ ఎన్నో మలుపులు. దివంగత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె అయిన గీతను నాగార్జున సాగర్ లో ఓ బోటులో తొలిసారి చూడడం ఇష్టపడడం.. రేవంత్ వ్యక్తిత్వం తెలిసి గీత కూడా ఇష్టపడడం, ఆమె కోసం స్వయంగా రేవంత్ గ్రీటింగ్ కార్డులు తయారు చేసి పంపడం, చివరకు పెద్దల ఒప్పించి వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమైంది. విశేషం ఏమంటే రేవంత్ ప్రేమలో పడింది ఇంటర్‌ చదివే రోజుల్లోనే. చివరకు కొన్నేళ్ల పాటు నిరీక్షణ అనంతరం.. ఇరు కుటుంబాల అంగీకారంతో 1992లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. రేవంత్ –గీతలవి ఒకటే సామాజిక వర్గాలు అయినా ఆర్థిక అంతరాలు ఉన్నాయి. అయినా, పెద్దలను తమ పట్టుదలతో ఒప్పించారు. ఇప్పుడు ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నారు.

విద్యాలయంలో చిగురించిన ప్రేమ..

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టిది రాజకీయ కుటుంబం. వారి పెద్దన్న మల్లు అనంతరాములు మాజీ ఎంపీ, ఏపీసీసీ మాజీ అధ్యక్షులు. భట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడ ఎంఏ హిస్టరీ చేస్తుండగా, నందిని ఆ యూనివర్సిటీలో చేరేందుకు వచ్చారు. భట్టి దళిత సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. నందిని వాళ్లది హైదరాబాద్‌ లో స్థిరపడిన ఉత్తరాది సంప్రదాయ కుటుంబం. అయితే, ఆమెను తొలి చూపులోనే ఇష్టపడ్డారు భట్టి. చిత్రం ఏమంటే.. నందినికి సెంట్రల్ వర్సిటీలో సీటు రాలేదు. కానీ, భట్టి మాత్రం ఆమెతో స్నేహం కొనసాగించారు. చివరకు అది ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.

పెళ్లిలో పుట్టిన ప్రేమ

తెలంగాణ వైద్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ. గతంలో ఉమ్మడి ఏపీ డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన తండ్రి రాజనర్సింహ కూడా ఉమ్మడి ఏపీలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దామోదర.. ఇంజనీరింగ్‌ చదువుతుండగా.. నిజామాబాద్‌ లో స్నేహితుడి పెళ్లికి వెళ్లారు. అక్కడే అమ్మాయి తరఫు బంధువు పద్మినీరెడ్డిని చూశారు. కొన్నాళ్ల తర్వాత ఆమెపై తన ప్రేమను తెలియజేశారు. నందినిరెడ్డి కూడా అంగీకరించారు. పెద్దలకు తెలియజేశాక చిన్నచిన్న వివాదాలు తలెత్తాయి. అయితే, చివరికి ఓ స్నేహితుడి సహకారంతో ఇద్దరూ 1985లో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పెద్దలు ఆశీర్వదించారు.

కాలేజీలో ప్రేమ..

ప్రేమలో కాకుండా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు వరంగల్ జిల్లాకు చెందిన కొండా మురళీధర్-సురేఖ. కాంగ్రెస్-వైసీపీ-బీఆర్ఎస్-కాంగ్రెస్.. ఇలా వీరి రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసిందే. వీరి ప్రేమ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇద్దరూ వరంగల్‌ ఎల్బీ కళాశాలలో బీకాం చదువుతున్న రోజుల్లో పరిచయమయ్యారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొదట మురళీనే ఇష్టాన్ని వ్యక్తంచేశారు. అనంతరం ఒకరినొకరు ఇష్టపడ్డారు. మురళీ.. 1987లో సురేఖను తిరుపతిలో వివాహమాడారు.

కాకా కుమారులు.. ఎమ్మెల్యే సోదరులు

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకంగా ఉండేవారు కె.వెంకటస్వామి. కాకాగా అందరికీ పరిచయమైన ఈయన కుమారులే చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద, వినోద్. ఈ ఇద్దరివీ ప్రేమ వివాహాలే. మంత్రిగానూ పనిచేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. ఆయన రమ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు. వివేకానంద ఎంబీబీఎస్ చదివారు. సరోజను ఇష్టపడి పెళ్లాడారు. ఇక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి-నీలిమ, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం-నీలిమ, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి-దయానంద్‌ దంపతులవీ ప్రేమ పెళ్ళిళ్లే.

Tags:    

Similar News