కాలకేయ ముఠాగా మండిపడుతూనే.. సీఎం రేవంత్ కీలక సూచన
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అధికారంలో ఉన్న వేళ తాము తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా అధికారపక్షం వ్యవహరించట మామూలే. అందుకు భిన్నంగా విపక్షంలో ఉన్న నేతల్ని సచివాలయానికి పిలిచి.. వారితో కలిసి కూర్చొని ఒక సీరియస్ అంశంపై చర్చ జరిపేందుకు.. వారిచ్చే సూచనల్ని.. సలహాల్ని తీసుకునేందుకు ఆహ్వానించటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆ పనిని తాజాగా చేపట్టారు సీఎం రేవంత్.
మూసీ ప్రక్షాళన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ ఎంత సీరియస్ గా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని చేపట్టటం ద్వారా ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికి ఆ విషయాన్ని ఆలోచించకుండా.. భవిష్యత్ అవసరాల కోసం హైదరాబాద్ మహానగరాన్ని సిద్ధం చేసేందుకు మూసీకి పూర్వవైభవం తీసుకురావాలన్న దానిపై భారీగా కసరత్తు చేస్తున్నారు సీఎం రేవంత్.
అయితే.. మూసీపై రేవంత్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నిర్వాసితుల పక్షాన నిలుస్తూ.. వారికి తాము అండగా ఉంటామని భరోసాను ఇస్తున్నాయి. ఇలాంటివేళ.. తెలంగాణ సీఎం సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. మూసీకి మంచి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకుంటున్నారంటూ విపక్షాలను కాలకేయులుగా పోల్చిన సీఎం వారిపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో విపక్షాలు సైతం ఊహించని ఒక ఆహ్వానాన్ని అందించారు.
మూసీ విషయంలో పేదలను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వ చర్యలు ఉంటాయన్న సీఎం రేవంత్.. విపక్షాలు చేసే రాజకీయాలకు చెక్ చెప్పే కార్యాచరణకు తెర తీశారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావు.. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లు సచివాలయానికి రావాలని కోరారు. తాను.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అధికారులందరూ కూర్చుందామని.. మూసీ ప్రణాళిక మీద చర్చిద్దామన్న సూచనను తెర మీదకు తీసుకొచ్చారు.
మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రజలకు ఇళ్లు ఇస్తే మేలు జరుగుతుందా? డబ్బులిస్తే మేలు జరుగుతుందా? అనే విషయాలపై ఆలోచిద్దామని పేర్కొన్నారు. మరి.. సీఎం రేవంత్ తెర మీదకు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు విపక్ష నేతలు ఏ మేరకు రియాక్టు అవుతారు? సీఎం చెప్పినట్లుగా వారు సచివాలయానికి వస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ విపక్షాలు స్పందించి.. ముఖ్యమంత్రి ప్రతి స్పందించి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. తెలుగు రాజకీయాల్లో సరికొత్త సన్నివేశానికి తెర తీసిన ఘనత సీఎం రేవంత్ కు దక్కుతుందని మాత్రం చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.