రంగంలోకి దిగితే ఎవరి మాటా వినని (ఏవీ) రంగనాథ్.. అసలు ఎవరీయన?

హైదరాబాద్ ట్రాఫికర్ కు చెక్ రంగనాథ్ నల్లగొండ ఎస్పీగా పనిచేసినప్పుడు.. అత్యంత సంచలనం రేపిన మారుతీరావు ఉదంతం చోటుచేసుకుంది.

Update: 2024-08-24 09:39 GMT

కాకినాడ నుంచి హైదరాబాద్ వరకు ఆయన పనిచేసిన ప్రతిచోటా సంచలన చర్యలు ఉండేవి.. లేదా అక్కడ సంచలన ఘటనలు జరిగేవి.. విధి నిర్వహణలో నిక్కచ్చి.. ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనకు మంచి బాధ్యత.. ఇక ఏదైనా సమస్యను టేకప్ చేశారా..? దాని అంతు చూడాల్సిందే.. ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు అయినా.. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య అయినా.. కాకినాడలో పెట్రోల్ దొంగలు అయినా.. తోక ముడవాల్సిందే. ఆయనే తెలంగాణ సీనియర్ ఐపీఎస్ ఆవుల వెంకట (ఏవీ) రంగనాథ్. ఆయన గురించి బాగా తెలిసినవారు మాత్రం అక్రమాలు, అన్యాయాల విషయంలో ఎవరి మాటా వినని (ఏవీ) రంగనాథ్ అని చెబుతుంటారు. ఇప్పుడు హైడ్రాతో హడల్ పుట్టిస్తున్నారు ఈ సూపర్ కాప్.

కాకినాడలో డీజిల్ మాఫియాపై ఉక్కుపాదం రంగనాథ్ ఉమ్మడి ఏపీలో డీఎస్పీగా ప్రస్థానం ప్రారంభించారు. 2006 సమయంలో కాకినాడలో ఏఎస్పీగా పనిచేస్తున్న సమయంలో సముద్రం నుంచి డీజిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న మాఫియా గుట్టును బయటపెట్టారు. ఓ రహస్య నివేదికను తయారుచేశారు. దీంతో అక్కడి రాజకీయ నాయకులు, పై అధికారులు కుట్ర చేశారు. రంగనాథ్ ను ఆఫీస్ కు రాకుండా తాళాలు వేశారు. కారు డ్రైవర్ ను పంపించివేశారు. అయినా ఆయన ధైర్యంగా నిలిచారు. తెరవెనుక జరుగుతున్న కుట్రను.. రంగనాథ్ కు కాకినాడలో ప్రముఖ మీడియా సంస్థ జర్నలిస్టు ఒకరు చేరవేసి అప్రమత్తం చేశారు. డీజిల్ మాఫియా సహా ఇదంతా అప్పట్లో పెద్ద సంచలనం అయింది.

ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ ఆగడాల ఆటకట్టు అప్పు తీసుకుంటే చెల్లించాల్సిందే.. అయితే, అది అమాయకులను వేధించేందుకు ఓ అస్త్రంగా మారితే..? అధిక వడ్డీలతో వారి ఉసురు పోసుకుంటంటే.. కాపాడేందుకు వచ్చేవారే పోలీస్. ఖమ్మం ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు రంగనాథ్ ఇదే పనిచేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వేధంపులు, ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేశారు. ఆయా సంస్థలు పదేళ్లయినా ఇప్పటికీ రంగనాథ్ పేరు చెబితే ఉలిక్కి పడుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఖమ్మంలో మైక్రో ఫైనాన్స్ దారుణాలు లేవంటే నమ్మాల్సిందే.

హైదరాబాద్ ట్రాఫికర్ కు చెక్ రంగనాథ్ నల్లగొండ ఎస్పీగా పనిచేసినప్పుడు.. అత్యంత సంచలనం రేపిన మారుతీరావు ఉదంతం చోటుచేసుకుంది. ఉమ్మడి ఏపీలో క్రిష్ణా జిల్లాలో ఉన్న సమయంలో అత్యంత సంచలనం రేపిన ఆయేషా మీరా ఘటన జరిగింది. ఇక రంగనాథ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ విభాగానికి వచ్చాక కీలక చర్యలు చేపట్టారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఆయన తీసుకున్న చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వరంగల్ కమిషనర్ గానూ కొన్ని విషయాల్లో రంగనాథ్ తనదైన ముద్ర వేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ సపోర్ట్ వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రంగనాథ్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో రంగనాథ్ కు బాధ్యతలు అప్పగించారు. తన మానస పుత్రిక అయిన హైడ్రాకు ఐజీ స్థాయి అధికారి అయిన రంగనాథ్ ను కమిషనర్ గా నియమించి ఫుల్ పవర్స్ అప్పగించారు. వాటి ఆధారంగా హైడ్రాతో రంగనాథ్ తనదైన శైలిలో పనిచేస్తూ వెళ్తున్నారు. హైడ్రా దూకుడుకు పలుకుబడి కలిగిన వ్యక్తులే కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అందుకే ఆయన రంగంలోకి దిగితే ఎవరి మాటా వినని (ఏవీ) రంగనాథ్ అని అంటుంటారు. అయితే, రంగనాథ్ ఏ ప్రభుత్వం ఉన్నా ఒక అధికారిగా తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తారు. అందుకే వైఎస్ నుంచి రేవంత్ వరకు ఏ సీఎం అయినా ఆయనకు మంచి బాధ్యతలు అప్పగిస్తున్నారు.

Tags:    

Similar News