పక్కపార్టీ నేతలే దిక్కా ?
ఇపుడు విషయం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి నేతలు చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు.
తెలంగాణా పార్టీ నేతల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో 17 సీట్లకు 17 సీట్లను బీజేపీ గెలుస్తుందంటారు. కానీ వాస్తవాలు ఏమిటో మాత్రం మాట్లాడుకోరు. తాజాగా కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతు మొత్తం 17 సీట్లలో అత్యధిక సీట్లలో బీజేపీ విజయం ఖాయమన్నారు. వాస్తవం ఏమిటంటే అన్నీ సీట్లలో పోటీచేయటానికి పార్టీ తరపున గట్టి అభ్యర్ధులు కూడా లేరు. ఈ వాస్తవాన్ని మాత్రం కమలనాదులు అంగీకరించరు.
ఇపుడు విషయం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటానికి నేతలు చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ప్రతి దరఖాస్తును పరిశీలిస్తే ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇవ్వగలిగే స్ధాయిలో నేతలు లేరని బయటపడింది. చాలా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీలకు మంచి పోటీ ఇవ్వగలిగిన నేతలు దొరకటంలేదట. పార్టీవర్గాల సమాచారం ప్రకారం వరంగల్, ఖమ్మం, నల్గొండ, మల్కాజ్ గిరి, భువనగిరి, చేవెళ్ళ, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ లాంటి సీట్లలో పార్టీలో గట్టి అభ్యర్ధులే లేరని తేలిందట.
అందుకనే పై నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వగలిగిన నేతలను ఇతర పార్టీల్లో నుండి తెచ్చుకోవాలని బీజేపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ముందుగా బీఆర్ఎస్ మాజీలపై బీజేపీ నేతలు దృష్టిపెట్టినట్లు సమాచారం. మాజీమంత్రులతో చర్చలు జరిపితే పెద్దగా సానుకూలం కాలేదని పార్టీవర్గాలు చెప్పాయి. నిజానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఓడిపోయారు. కాబట్టి వీళ్ళు కూడా రాబోయే ఎన్నికల్లో గెలిచేది అనుమానమే. కాకపోతే చాలామందితో పోల్చుకుంటే వీళ్ళకు కాస్త పట్టుంది.
పార్టీవర్గాల సమాచారం ప్రకారం తక్కువలో తక్కువ 12 నియోజవకర్గాల్లో బీజేపీ తరపున పోటీచేయటానికి పక్కపార్టీల నేతలే దిక్కయ్యేట్లున్నారు. పక్కపార్టీల నుండి ఎవరూ రాకపోతే ఏమి చేయాలో కమలనాదులకు అర్ధంకావటంలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లీడర్లకు గాలమేసిన విషయం తెలిసిందే. ఏదేమైనా వాస్తవాలు అందరికీ తెలిసినా బీజేపీ నేతలు మాత్రం బీభత్సమైన బిల్డప్పులు ఇస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.