తెలంగాణ మంత్రుల మధ్య నామినేటెడ్ చిచ్చు

అధికారం రాక అల్లాడిపోయిన కాంగ్రెస్ నేతలు.. చేతికి పవర్ వచ్చిన తర్వాత తమ పాత వాసనల్ని వదిలించుకోలేకపోతున్నారు

Update: 2024-03-19 04:30 GMT
తెలంగాణ మంత్రుల మధ్య నామినేటెడ్ చిచ్చు
  • whatsapp icon

అధికారం రాక అల్లాడిపోయిన కాంగ్రెస్ నేతలు.. చేతికి పవర్ వచ్చిన తర్వాత తమ పాత వాసనల్ని వదిలించుకోలేకపోతున్నారు. కేసీఆర్ సర్కారులో మంత్రులు డమ్మీలుగా.. వారికంటూ ఎలాంటి అధికారాలు లేకపోవటమే కాదు.. వారి శాఖకు సంబంధించిన సమీక్షను సైతం వారు చేసుకునే స్వేచ్ఛ ఉండేది కాదు. అందుకు భిన్నంగా రేవంత్ సర్కారులో పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యన నామినేటెడ్ పదవుల పంపిణీ కార్యక్రమానికి తెర తీశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారం మంత్రుల మధ్య చిచ్చు రాజేసినట్లుగా చెబుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే వేళ.. తమను సంప్రదించలేదంటూ గుర్రుగా ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జిల్లాకు చెందిన మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సన్నిహితులకే పదవులు దక్కాయని.. ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది తప్పించి.. తమను పట్టించుకోవటం లేదన్న కినుకుతో పొన్నం ఉన్నట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా నేరెళ్ల శారద.. కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నియామకంపై పొన్నం ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తన సొంతజిల్లాకు చెందిన అంశాల్ని తనతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ పై ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న దీపాదాస్ మున్షీ వద్ద పొన్నం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం.

ఈ మొత్తం ఎపిసోడ్ లో పొన్నంను పక్కన పెట్టేసి మరో మంత్రి శ్రీధర్ బాబు అనుకూల వర్గానికి పెద్ద పీట వేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సుడా ఛైర్మన్ పదవి పొందిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించే ప్రయత్నం చేశారని.. అలాంటి వ్యక్తికి నామినేటెడ్ పదవి ఎలా కట్టబెడతారన్నది పొన్నం ప్రశ్నగా చెబుతున్నారు. నామినేటెడ్ పదవులు పొందిన వారంతా శ్రీధర్ బాబుకుసన్నిహితులు కావటం వల్లే పదవులు కట్టబెట్టారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. మొత్తంగా నామినేటెడ్ పదవుల పంపకం వేళ.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ ఇద్దరి విషయంలో రేవంత్ జాగ్రత్తగా తూకం వేయాల్సి ఉందని.. ఈ విషయంలో ఆయన తప్పు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News