17లో బీఆర్ఎస్ ఎంపీ సీట్లు ఆ ఇద్దరికి ఖరారు?

తెలంగాణ ఏర్పాటు నుంచి అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కు తాజా ఎన్నికల్లో పరాజయం ఎదురైంది

Update: 2024-01-23 14:17 GMT

తెలంగాణ ఏర్పాటు నుంచి అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ కు తాజా ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల పరంగా చూస్తే.. 2014లో ఆ పార్టీ 65 స్థానాల బొటాబొటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2018లో అనూహ్యంగా ముందస్తుకు వెళ్లి బొంబాట్ మెజార్టీతో 88 సీట్లు గెలుచుకుంది. అయితే, ఈ పార్టీకి మొదటి నుంచి లోక్ సభ స్థానాల గెలుపు కాస్త కష్టంగానే సాగింది. 2019లో.. ఆరు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో సీట్లు గెలిచినా.. పార్లమెంటుకు ''సారు కారు పదహారు'' అంటూ గట్టి నినాదంతో బరిలో దిగినా గెలిచింది 9 సీట్లు మాత్రమే. 2014లో 11 సీట్లు నెగ్గింది. నాడు వైసీపీ నుంచి గెలిచిన పొంగులేటి కూడా టీఆర్ఎస్ లోకి రావడంతో బలం 12కు పెరిగింది.

ఈసారి పరిస్థితి ఏమిటో?

వచ్చే లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగా కీలకమైనవి. తెలంగాణలో అంతకంటే ముఖ్యమైనవి. ఇక్కడ త్రిముఖ పోటీ ఖాయం. దేశంలో మోదీ హవాతో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం లోక్ సభకూ కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక శాసన సభ సమరంలో గట్టి నమ్మకం పెట్టుకుని మరీ ఓడిన.. బీఆర్ఎస్ ఎలాగైనా లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి తన ప్రాధాన్యం తగ్గలేదని చెప్పాలని చూస్తోంది.

సుదీర్ఘ సమీక్ష

సార్వత్రిక ఎన్నికల్లో గనుక ప్రభావం చూపకుంటే వచ్చే దుష్పరిణామాలు బీఆర్ఎస్ కు తెలుసు. అందుకనే ఈ నెల 3 నుంచి సోమవారం వరకు సుదీర్ఘంగా సమీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. వాస్తవానికి తెలంగాణలో 17 సీట్లున్నప్పటికీ హైదరాబాద్ మీద ఎంఐఎం తప్ప ఏ పార్టీకీ ఆశలు ఉండవు. నికరంగా 16 కిందనే లెక్క. ఈ 16 మందిలో బీఆర్ఎస్ పనితీరు, ప్రజల్లో పేరు పరంగా ఇద్దరు అభ్యర్థులను చాలా ముందుగానే ఖరారు చేసింది. వీరు.. చేవెళ్ల సిటింగ్ ఎంపీగా ఉన్న డాక్టర్ రంజిత్ రెడ్డి ఒకరు అయితే, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరొకరు. ప్రజలకు అందుబాటులో ఉంటూ డాక్టర్ రంజిత్ రెడ్డి.. పార్టీ వాయిస్ ను వినిపిస్తూ వినోద్ కుమార్ తమ ప్రత్యేకత చాటుకున్నారు. దీంతో వీరికి ముందుగానే టికెట్లు దక్కాయని చెబుతున్నారు. ఇక మిగిలిన 15 మందిని ఎంపిక చేయడం పార్టీ అధినేత కేసీఆర్ చేతిలో ఉంది. దీనిపై నెలాఖరులోపు నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News