అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఫోన్!.. మ్యాటర్ చదవాల్సిందే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణ పోలీసుల ట్యాపింగ్ ఎపిసోడ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన తెలంగాణ పోలీసుల ట్యాపింగ్ ఎపిసోడ్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి నిఘా వ్యవస్థకు బాస్ గా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు మీద బోలెడన్ని ఆరోపణలు వస్తుండటం తెలిసిందే. అయితే.. ఈ అంశంపై తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ట్యాపింగ్ వ్యవహారంలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ట్యాపింగ్ అంశం వెలుగు చూసిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు జారుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ట్యాపింగ్ లో ఆయన చెప్పినట్లే చేశామని.. ఆయన ఆదేశాల్ని ఫాలో అయినట్లుగా ఇప్పటికే అరెస్టు అయిన పోలీసు అధికారులు చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావును ప్రశ్నించటం అనివార్యంగా మారింది.అయితే.. ఆయన ట్యాపింగ్ ఎపిసోడ్ తెర మీదకు వచ్చినంతనే అమెరికాకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఆయన ఆచూకీ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలాంటి వేళ.. ఒక సీనియర్ పోలీసు అధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేసినట్లుగా సమాచారం. తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లినట్లుగా పేర్కొంటూ.. ట్యాపింగ్ అంశంలో తన పేరును ఎందుకు లాగుతున్నట్లుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. సదరు అధికారితో మాట్లాడుతూ.. మనం మనం పోలీసులం. మీరు ప్రస్తుత ప్రభుత్వం చెప్పినట్లు చేస్తున్నారు. మేం గత ప్రభుత్వం చెప్పినట్లు చేశామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనపై సదరు ఉన్నతాధికారి స్పందిస్తూ.. మీరేం చెప్పాలనుకున్నా అదంతా అధికారిక మొయిల్ రూపంలో పంపండి. అంతేకానీ ఫోన్ లో కాదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ ఆరోపణల మీద స్పందించిన ప్రభాకర్ రావు.. తన ఇళ్లల్లో సోదాల్ని వెంటనే ఆపాలని.. తాను జూన్ .. జులైలో హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారి ‘‘మీరేం చెప్పాలనుకున్నా.. అధికారిక మొయిల్ పంపండి’’ అని చెప్పటంతో కాల్ కట్ చేసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.