ఎన్నికల వేళ రేవంత్ ఇంటికి దగ్గర్లో ట్యాపింగ్ సెటప్

సంచలన అంశం వెలుగు చూసింది. ఇప్పటివరకు తెలంగాణను ఊపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ లో కొత్త అంశం తెర మీదకు వచ్చింది

Update: 2024-03-26 04:40 GMT

సంచలన అంశం వెలుగు చూసింది. ఇప్పటివరకు తెలంగాణను ఊపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ లో కొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఇటీవల ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ‘టార్గెట్ రేవంత్’ పేరుతో ఒక స్పెషల్ ఆపరేషన్ జరిగిందా? ఆయన ఇంటికి సమీపంలో ఒక ట్యాపింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారా? లాంటి సంచలన ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం కొందరు పోలీసు అధికారులు ఎన్నికల వేళ టీపీసీసీ అధినేతగా ఉన్న రేవంత్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేయటమే కాదు.. ఆయన నివాసానికి దగ్గర్లో ప్రత్యేక డివైజ్ లతో ట్యాపింగ్ సెంటర్ ను నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

ఇంటికి సమీపంలో ఒక ఇంట్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక డివైజ్ లతో.. రేవంత్ ఇంట్లోని వారి సంభాషణలు.. వారి ఫోన్ కాల్స్ ను రహస్యంగా విన్నట్లుగా ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు చేస్తున్న అధికారుల ద్రష్టికి వచ్చింది. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ప్రత్యేక డివైజ్ తో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం రవిపాల్ అనే సాంకేతిక నిపుణుల్ని కన్సెల్టెంట్ పేరుతో ఎస్ ఐబీ అధికారులు వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.

నిజానికి ఇలాంటి పరికరాలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే వినియోగించాల్సి ఉంటుంది. అయితే.. రవిపాల్సాయంతో కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లుగా సమాచారం. ఈ పరికం ప్రత్యేకత ఏమంటే.. 300 మీటర్ల మేర ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్ లలో చొరబది వాటి మైక్రోఫోన్ ఆన్ అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు. ఆ పరిధిలో ఉండే వైఫై.. ఇంటర్నెట్ డేటాతో కనెక్టు అయిన ఎన్ని ఫోన్లు.. స్మార్ట్ టీవీలు.. అలెక్సా వంటి టూల్స్ కూడా ఈ డివైజ్ పరిధిలోకి వస్తాయని చెబుతున్నారు.

రేవంత్ ఇంటికి సమీపంలో ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. వారి కుటుంబ సభ్యుల మాటల్ని కూడా రహస్యంగా విన్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా ఎన్నికల వ్యూహాల్ని ముందస్తుగా తెలుసుకోవటంతో పాటు.. రేవంత్ కుటుంబ సభ్యులు ఏమేం మాట్లాడుకున్నారన్న అంశాల్ని కూడా ముందే ట్రాక్ చేసినట్లుగా చెబుతున్న అంశాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.

Tags:    

Similar News